Mar 27,2023 18:10

న్యూఢిల్లీ : గత నెలరోజులుగా మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌) కార్మికులు ఢిల్లీలో ఆందోళన చేపడుతున్నారు. ఈ ఉపాధి చట్టంపై మోడీ ప్రభుత్వ దాడిని వ్యతిరేకిస్తూ వీరు నిరసనకు దిగారు. .గతేడాది జనవరి నుండి జాతీయ మొబైల్‌ పర్యవేక్షణ సేవ (ఎన్‌ఎంఎంఎస్‌) ద్వారా కార్మికుల హాజరును తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌ ఆధారిత హాజరును రద్దు చేయడంతో పాటు ఆధార్‌ ఆధారిత చెల్లింపులు, ఉపాధి చట్టానికి బట్జెట్‌లో కోత విధించడాన్ని, వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం, పెండింగ్‌ వేతనాల విడుదల వారి డిమాండుల్లో ప్రధానంగా ఉన్నాయి. నిరసనలకు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు పదే పదే అడ్డుకుంటున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులు, కార్యకర్తల నిర్బంధం

ఈనెల 24న నిరసనకారులు ఢిల్లీ యూనివర్శిటీలోని ఆర్ట్‌ ఫ్యాకల్టీకి చెందిన విద్యార్థులను కలిసేందుకు యత్నించారు. దీంతో విద్యార్థులు, కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు కొన్ని గంటల పాటు నిర్బంధించారు. విద్యార్థుల నిర్బంధంపై ఈ ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న సంస్థల మాతృ సంస్థ నరేగా సంఘర్ష్‌ మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది. కలెక్టివ్‌ అనే విద్యార్థి సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్థికవేత్త జీన్‌ డ్రేజ్‌, యుపికి చెందిన సంఘటిత్‌ కిసాన్‌ మజ్దూర్‌ సంఘటన్‌కి చెందిన రిచాసంఘ్,  హర్యానాలోని జన్‌ సంఘర్ష్‌ మంచ్‌కి చెందిన రిచాసింగ్‌లు ప్రసంగించాల్సి వుందని.. అయితే కార్యక్రమం ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే పోలీసులు విద్యార్థులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని అన్నారు. వారిలో విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారని, కొందరిని మారిస్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారని చెప్పారు. సోమ్‌నాథ్‌, డియుకి చెందిన ఇద్దరు విద్యార్థులు, విదేశీ విద్యార్థులను సుమారు మూడు గంటల పాటు నిర్బంధించారని  అన్నారు.

protesting-nrega-workers

గత నెలరోజులుగా కార్మికుల ప్రతినిధులు గ్రామీణాభిóవృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఒఆర్‌డి)కిచెందిన పలువురు అధికారులకు తమ సమస్యలను చెప్పేందుకు వెళ్లారని, కానీ వారు వినిపించుకోలేదని అన్నారు. కానీ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ పార్లమెంటు సాక్షిగా ఆరోపించారని అన్నారు. ఈ నెల 21న జార్ఖండ్‌ కార్మికుల ప్రతినిధి బృందం ఎంఒఆర్‌డి సెక్రటరీ శైలేష్‌కుమార్‌, జాయింట్‌ సెక్రటరీ అమిత్‌ కటారియాలతో సమావేశమయ్యారని.. అయితే అధికారులు సమస్యలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన కార్మికులకు 2021 డిసెంబర్‌ నుండి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ ఏడాది వారికి పనిని కేటాయించలేదని చెప్పారు. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామని అన్నారు. నెలరోజులకు పైగా ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.