Mar 19,2023 21:35

లండన్‌ : ఇంగ్లండ్‌ ప్రభుత్వం తీసుకుని వచ్చిన నూతన వలసదారుల చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు వెళ్లువెత్తాయి. లండన్‌తో సహా స్కాట్లాండ్‌, వేల్స్‌ రాజధాని కార్డిఫ్‌లో ఈ నిరసనలు జరిగాయి. వేలాది మంది ఇందుల్లో పాల్గన్నారు. లండన్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో 2 వేల మందికి పైగా హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్త వలసదారుల చట్టం అమానవీయమని, చట్టవిరుద్ధమని నిరసనకారులు ఆరోపించారు. జాత్యహంకారంతో కూడిన ఈ ప్రభుత్వం ప్రజల్ని విభజించడానికే ఈ బిల్లును తీసుకుని వచ్చిందని విమర్శించారు. ఇంగ్లండ్‌కు అక్రమ వలసలను నిరోధించే పేరుతో కొత్త చటాన్ని గతవారంలో ఇంగ్లండ్‌ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అనుమతి లేకుండా ఇంగ్లండ్‌కు వలస వచ్చే వారిని రువండా వంటి మూడో ప్రపంచ దేశాలకు పంపిస్తారు. ఈ బిల్లును ఇప్పటికే ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో, మానవ హక్కుల కమిషన్‌ కూడా వ్యతిరేకించాయి.