Mar 19,2023 15:33

పారిస్‌ : పెన్షన్‌ బిల్లుని వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేస్తున్న నిరసనకారులపై మాక్రాన్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. టియర్‌గ్యాస్‌తో పాటు డస్ట్‌బిన్‌లకు నిప్పటించి నిరసనకారులపెకి విసిరారు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వందలాది మందిని అరెస్టు చేశారు. పార్లమెంట్‌ అనుమతి లేకుండా మాక్రాన్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ బిల్లును వ్యతిరేకిస్తూ శనివారం దక్షిణ పారిస్‌లోని ప్లేస్‌ డిఇటాలిలో వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. రిఫైనరీల్లోని కార్మికులతో పాటు పారిశుధ్య కార్మికులు కూడా సమ్మెకు దిగారు. దీంతో పారిస్‌ వీధులు చెత్తమయమయ్యాయి.రిఫైనరీలు, డిపోలకు చెందిన 37 శాతం మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గన్నారని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. రైల్వే కార్మికులు కూడా ఆందోళన బాట పట్టారు. పెన్షన్‌ సంస్కరణ బిల్లుని అమలు చేసి తీరతామని, నిరసనలను సహించేది లేదని ఆర్థిక మంత్రి బ్రూనో మీడియాకు వివరించారు.