
తెలుగు నేలపై ఆబాలగోపాలాన్నీ ఆనందింపజేసి, అన్ని కళారూపాలతోపాటు దీర్ఘకాలం వర్థిల్లిన కళారూపం- తోలుబొమ్మలాట. ఇది సకల కళా సమన్వితం. లలిత కళలన్నీ ఈ ప్రదర్శనలో మూర్తీభవించి వుంటాయి. దీనిలో కవిత్వం, సాహిత్యం, శిల్ప, చిత్రకళలు తొణికిసలాడుతుంటాయి. కడుపుబ్బ నవ్వించే హాస్యరస ఘట్టాలుంటాయి. లలితకళలన్నిటిలోనూ తోలుబొమ్మలాట ప్రదర్శన కన్నుల పండువగా వుంటుంది. 'ఇంచుక నేర్పు చాలక విహీనత జెందిన నా కవిత్వమున్/ మించు వహించె నీకతన మిక్కిలి, యెట్లన తోలుబొమ్మలన్/ మంచి వివేకి వాని తెరమాటున నుండి ప్రశస్తరీతి నా/ డించిన నాడవే? జనుల డెందము నింపవె' అంటూ భాస్కర శతకంలోని పద్యం నాటి తోలుబొమ్మలాట ప్రశస్తిని చెబుతుంది. 'యంత్రకు డాడించి యవని ద్రోచిన వ్రాలు/ బొమ్మల గతి రథపూగములను' అంటూ బొమ్మలాటల వారు రామాయణంలోని ద్విపదలను పాడేవారని సురవరం ప్రతాపరెడ్డి 'సాంఘిక చరిత్ర'లో వివరించారు. తోలుబొమ్మలాటలను గురించి అనేక శాసనాల్లో ఉదహరింపబడి వున్నట్లు ప్రముఖ రచయిత, చారిత్రకులు చాగంటి శేషయ్య ఒక శాసనాన్ని సైతం బయటపెట్టారు. ఏ దేశంలోనైనా నాటకానికి పూర్వరంగం-వీధి నాటకాలు, చెక్కబొమ్మలు, కొయ్యబొమ్మలు, పేడ బొమ్మలు, లక్క బొమ్మలేననేది చరిత్ర చెబుతోంది. కాళిదాసు, భవభూతి, బాణుడు వంటివారు రాసిన సంస్కృత నాటకాలకు నాంది ఈ కొయ్యబొమ్మలేనని ప్రతీతి. ఈ బొమ్మలకు రంగులద్ది, రంగురంగుల వస్త్రాలు కట్టి, దీపపు స్తంభాల వెలుగులో ఆడిస్తుండేవారు. ఈ బొమ్మలు అనేక చారిత్రక, పౌరాణిక, జానపద కథలకు పాత్రధారులుగా వుండేవి. కవిత్వం, సాహిత్యం, హాస్యరసంతో ఈ మూగ పాత్రలకు ప్రాణం పోసేవారు కళాకారులు.
ఇప్పటికీ కొన్ని కుటుంబాలు తోలుబొమ్మల తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. జంతుచర్మాలు, మొక్కలు, రాళ్లనుంచి తీసిన రంగులతో తోలుబొమ్మలను ఆయా కళారూపాలకు సంబంధించిన పాత్రల ఆకృతులను రూపొందిస్తారు. తమ ప్రతిభతో, కళానైపుణ్యంతో కడుపుబ్బ నవ్వించే కళాకారులు... నిజజీవితంలో కడుపులు మాడ్చుకుంటున్నారు. వీరి కళలకు, ప్రతిభకు తగిన ప్రాచుర్యం లేదు. ప్రతిఫలం దక్కదు. పామర జనాన్ని అలరించే ప్రక్రియగా వున్న ఈ కళారూపాన్ని కూడా మార్కెట్ తన గుప్పెట చిక్కించుకుంది. పండిత, పామరులన్న తేడా లేకుండా వినోదాన్ని పంచిన ప్రాచీన కళారూపం... నేడు రంగురంగుల లైట్ల మధ్య రకరకాల సౌండ్ల మధ్య ఆడిటోరియంలలో అసహజత్వాన్ని పండిస్తోంది. దీనికితోడు ఊరి మధ్యకొచ్చిన సినిమాలు, నట్టింటికొచ్చిన టీవీల ముందు తోలుబొమ్మలాట వెలవెలబోయింది. 'చేలలోని ఏల పాటలు ఎలా వింటాము?/ చెవులలో నగర సంగీతం చెవులొలుకుతుంటే' అంటాడు ఖలీల్ జిబ్రాన్. అంతేకాదు... తోలుబొమ్మలాట అనగానే రాజకీయ క్రీడ కూడా మన కళ్లముందు ద్యోతకమౌతుంది. ఈ క్రీడలోనూ జుట్టుపోలిగాడు, బంగారక్క, కేతిగాడు వంటి పాత్రలు మన కళ్లముందు కదలాడుతుంటాయి. సామ్రాజ్యవాదుల చేతుల్లో, కార్పొరేట్ల చేతుల్లో... వారు ఆడమన్నట్లు ఆడుతుండే 'కీలుబొమ్మలు' గుర్తురావడం యాదృచ్ఛికం. అమెరికా చేతిలో దేశాన్ని ఆటబొమ్మలా మార్చే ప్రయత్నం చేసేదొకడు. కేంద్రప్రభుత్వం చేతిలో రాష్ట్రాన్ని ఆటబొమ్మగా మార్చింది ఇంకొకడు. సంఫ్‌ు పరివార్ శక్తులు ఆడించినట్లు ఆడే ఉన్నతాధికారులు మరికొందరు. తోలుబొమ్మలాట మధ్యలో హాస్యాన్ని పండించడానికి తటాలున వచ్చే కేతిగాడు లాంటి పాత్రలో ఇంకొకడు. వీరంతా మన రాజకీయ యవనికపై వారివారి పాత్రలను రక్తికట్టిస్తున్నవారే.
తోలుబొమ్మలు, కీలుబొమ్మలు మనిషి చెక్కిన ఆటబొమ్మలే. రాజకీయ కీలుబొమ్మలు రాజ్యాంగ వ్యవస్థలను, ప్రకృతి వనరులను కార్పొరేట్లకు, సామ్రాజ్యవాదులకు దోచిపెడుతూ, ప్రజల ముందు నటిస్తుంటాయి. తోలుబొమ్మలకు యెద లేదు, మేధ లేదు. వక్ర ఆలోచనలూ లేవు. నోటిలో నాల్క లేదు, నొసటి చిట్లింపులూ లేవు. అయినా హాస్యాన్ని ఒలికిస్తాయి, గుండెల్లో కళామృతాన్ని చిలకరిస్తాయి. హాస్యరసాన్ని పండిస్తాయి. తోలుబొమ్మలాట కళారూపాన్ని, కళాకారులను కాపాడుకోవాలి. ఈ తోలుబొమ్మలాట కళను, కళాకారులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రతి ఏడాది మార్చి 21ని 'తోలుబొమ్మలాట దినోత్సవం'గా నిర్వహిస్తున్నారు. కళ కళ కోసం కాదు, ప్రజల కోసం. ప్రజా చైతన్యం కోసం. ఆ కళను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిదీన్నూ.