
కీవ్ : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌లోని మారియోపోల్‌లో ఆకస్మికంగా పర్యటించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలు ప్రారంభమైన అనంతరం విలీన భూభాగాల్లో పుతిన్ పర్యటించడం ఇదే మొదటిసారి. పుతిన్ శనివారం ప్రత్యేక హెలికాప్టర్ లో మారియోపోల్ కు వెళ్లారని, కారులో నగరం అంతటా పర్యటించారని స్థానిక మీడియా తెలిపింది.ఉక్రెయిన్‌లో రష్యన్లు అధికంగా గల క్రిమియా రిఫరెండమ్ ద్వారా రష్యాలో విలీనమై తొమ్మిదేళ్లయిన సందర్భంగా ఆ భూ భాగాన్ని సందర్శించిన అనంతరం పుతిన్ మారియోపోల్‌కు వెళ్లారు. స్థానిక మాస్కో-నియమించిన గవర్నర్ మిఖాయిల్ రజ్వోజాయేవ్‌తో కలిసి నల్ల సముద్రపు ఓడరేవు నగరం సెవాస్టోపోల్‌ను సందర్శించినట్లు రష్యా మీడియా పేర్కొంది. పుతిన్ ఎల్లప్పుడు సెవాస్టోపోల్ ప్రజలకు అండగా ఉంటారని రజ్వోజాయేవ్ చెప్పారు.