Oct 11,2021 07:16

   రాయలసీమ చరిత్ర చూస్తే రత్నాల రాశులు ప్రస్తావనకు వస్తాయి. కానీ నేటి వాస్తవ చిత్రాన్ని చూస్తే 'నీళ్లు తడవని బీళ్ళు - తడి ఆరని కళ్ళు'గా కనబడుతుంది. ఈ రెండింటి మార్పు మధ్య ప్రజల సాంఘిక, జీవన ప్రమాణాల్లో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు. కానీ సాహిత్యం ఎక్కడా స్తబ్దతకు గురికాలేదు. సీమ ప్రాచీన ప్రక్రియలైన పద్యం, యక్షగానం, ప్రబంధం, నాటకం, అవధానం వంటి వాటికి మూలస్తంభంగా నిలుస్తూ వచ్చింది. మరికొన్ని కళారూపాలకి మాతృకగా ఉంది.
    ఆధునిక ప్రక్రియ విమర్శ విషయంలో రాయలసీమ చాలా ముందుంది. తెలుగులో విమర్శకి కందుకూరి వీరేశలింగం, కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి వంటివారు బీజాలు వేసినప్పటికీ దానిని నవీన పంథాలో నడిపింది మాత్రం సీమవాసి కట్టమంచి రామలింగారెడ్డి. తొలితరం విమర్శకులుగా కట్టమంచి, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, రాచమల్లు రామచంద్రారెడ్డి, పుట్టపర్తి నారాయణాచార్యులు, తిరుమల రామచంద్ర వంటి లబ్ధి ప్రతిష్టులు నిలుస్తారు. తర్వాతి కాలంలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య, ఆర్‌.ఎస్‌.సుదర్శనం, త్రిపురనేని మధుసూదనరావు, సర్దేశాయి తిరుమలరావు, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మొదలైన వాళ్ళని పేర్కొనవచ్చు. కట్టమంచి వారిలో రచయిత, విమర్శకుడే కాకుండా ఆర్థిక శాస్త్రాన్ని ఐదో వేదంగా ప్రకటించిన గొప్ప సిద్ధాంతకర్త అన్నది పెద్దగా లోకానికి తెలీదు. రాజకీయ, సామాజిక, సాహిత్య విమర్శకుడుగానే తెలిసిన రాచమల్లు రామచంద్రారెడ్డిలో 'అలసిన గుండెలు' చూపించే కథకుడున్నాడు. ప్రబంధయుగ సాహిత్యంపైనే ఎక్కువగా పరిశోధన చేసిన విమర్శకుడిగానే కనబడే రాళ్లపల్లి వారిలో కూడా 'రఘువంశ చరిత్ర' రాసిన కవి హృదయం ఉంది. అలాగే రాచపాళెంలో విమర్శకుడు మాత్రమే కాకుండా రచయిత కూడా దర్శనమిస్తాడు. కరువు నేలలో పండిన ధాన్యం చుట్టూ 'పోలి'గా తన కలాన్ని తిప్పాడు. కవిత్వమే కాకుండా అనువాదాలు, నానీలు కూడా రాశారు. 2006వ సంవత్సరంలో 'సీమ నానీ'లను తీసుకొచ్చారు. అప్పటి వరకూ సీమలో అంతగా పరిచయం లేని నానీల ప్రక్రియకు ప్రాచుర్యం కల్పించారు.
     ఆధునిక తెలుగు సాహిత్యంలో నానీలు అన్నది నూతనమైన చిన్న ప్రక్రియ. దీన్ని సృష్టించింది ఆచార్య యన్‌.గోపి. నానీ అన్నది నాలుగు పాదాలు కలిగి ఉండాలి. మొత్తం అక్షరాలు 20 - 25 ఉండాలి. (ఇటీవల కాలంలో చాలామంది ఎక్కువ తక్కువగా కూడా రాస్తున్నారు) వాటిలో భావం రెండు యూనిట్లగా ఉండాలి. అందులో ఒకటి కొసమెరుపుతో కూడుకొన్న సమర్థకం ఉండాలి. ఇది నాని యొక్క అంతర్‌ - బహిర్గత నిర్మాణం సుక్ష్మంగా.
    రాచపాళెం రాసిన ఈ సీమ నానీలు 110కి మించి లేవు. కానీ రాయలసీమ స్థితిగతుల్ని, అస్తిత్వాన్ని, భాషా, సాంస్క ృతిక వివక్షతని బలంగా వినిపిస్తాయి. ఈ నానీలో ఔ×ు ఉఖీ ూఉవీజు ఔ×ూణఉవీ ఉఖీ వీAచ్‌ీ అన్నట్టుగా చాలా లోతైన భావాల్ని నింపారు చంద్రశేఖరరెడ్డి. ఇందులోని నానీలను ప్రధానంగా నాలుగు అంశాలకు సంబంధించినవిగా విభజించుకోవచ్చు. 1. ఫ్యాక్షన్‌ 2. కరువు 3. సీమ మహనీయుల స్మరణ 4. భాషా వివక్ష.
     ఫ్యాక్షన్‌, కరువులతో కూడుకొన్న ఆధునిక సాహిత్యం రాయలసీమకి సహజంగా మారిపోయి వస్తుంది. అందుకు ఎన్నో కారణాలు లేకపోలేదు. రాయలసీమ స్మరణ ఏ ప్రాంతంలో ఎవరికి తీసిపోని ప్రతిభా సంపన్నులున్నారు. తొలి భారత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి నుంచి నేటి మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల వరకూ ముఖ్యంగానో, మూలాలుగానో ఎందరెందరో ఉన్నారు. తొలి భారతీయ తిరుగుబాటు యోధుడు నరసింహారెడ్డిని కీర్తిస్తూనే
'ఉయ్యాలవాడా!
తెల్లోడి గుండెల్లో నీ నీడ
అందుకే కోట గుమ్మంపై
నీ తల'
సీమ రచయితల్ని వారు కీర్తిగడించిన రచనతో పేర్కొంటూ సృజనాత్మకంగా మలచడం ఒక కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. చరిత్రలో ఆధిపత్యం కింద సామాన్యులు నలిగి నశించిన సంఘటనల్ని ఎక్కడ నాంచకుండా నానీకరించారు రాచపాళెం.
'పాదిరి కుప్పం
ఓట్లలో దగ్ధమైన కొట్టం
కాదా అది
సీమ జలియన్‌'
1983 ఎన్నికల్లో దళితులు తమకు ఓట్లు వేయలేదని అగ్రకులం వారు దళితుల కొట్టానికి నిప్పుపెట్టి సజీవదహనం చేశారు. ఈ సంఘటనని స్వాతంత్రం కోసం పోరాడుతున్నప్పటి కాలంలో జరిగిన జలియన్‌ వాలాబాగ్‌తో పోలుస్తూ ఇంకా దళితులకి స్వాతంత్రం రాలేదన్న ప్రశ్నని నర్మగర్భంగా నిలబెట్టారు. ఇవే కాక సీమలో పారని నది ఆనవాళ్ళని, ఎండగాలుతున్న సీమ రైతుల్ని, లారీ ఎక్కి ఆకలితో వెళ్ళిపోతున్న పశువుల్ని, రైలు ఎక్కి వలస పోతున్న బక్క బతుకుల్ని చూపిస్తూ ప్రతి నానీలోనూ ఒక కథ నింపారు.
ఈ నానీలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భాషా వివక్షత గురించి. సీమ పిలుపుల్లో కొన్ని భాషాభాగాలకి (నామ, సర్వ, క్రియ..) 'అప్ప' అనే పదాన్ని ఆపాదించడం సహజం. ఇది ఆ మనుషుల మధ్య ఉన్న ఆప్యాయతకి 'ప్రతీక'. ఈ పదం సీమ అస్తిత్వంగా భావించవచ్చు. అటువంటి పదాన్ని తీసుకొని సినిమావాళ్ళు నీచ పాత్రలకు ప్రాణం పోస్తున్నారు. 'ఇలా మాట్లాడుతున్నాడంటే విలనేరా' అనే స్థాయికి దిగజార్చాతున్నారు. దీనిపైన వారి స్థాయిలోనే గర్జించారు.
'సిన్మాలోడా
సీమతో పెట్టుకోకు
వేషాలు వేస్తే
మా యాసతో కొడతాం'
ప్రతి కళకి ఒక పరమార్థం ఉంటుంది. ప్రతి మాధ్యమానికి ఒక బాధ్యత ఉంటుంది. మన దేశంలో ఎక్కువగా ఆరాధించే కళగాను, మాధ్యమంగాను గల చిత్రసీమ ఇటువంటి పోకడలకు పోవడం భావ రాహిత్యమే. విడివడిన తెలంగాణ యాసను వదిలి సీమ యాసపై పడ్డారా? లేక మునపటిలా చిత్తూరు నాగయ్య, కె.వి.రెడ్డి, బి.ఎన్‌.రెడ్డి వంటి దిగ్గజాలు ఈ ప్రాంతం నుంచి లేకపోవడం వల్ల ఈ దాడి జరుగుతుందా? అన్న ప్రశ్నలు ఎప్పటి నుంచో రాయలసీమ మేధో - రచయితలలో మొదలై, మెలిపెట్టే ప్రశ్నలుగా తలెత్తుతునే ఉన్నాయి. కొన్ని భాషలతో కూడుకున్న 'ప్రెసిడెన్సీ' నుంచి విడివడి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అందరం ఏకమయ్యాం. అలాంటి మనలోనే యాసల మధ్య వైరుధ్యాలు పెంచుకుంటే ఐక్యత, ఉనికిని కోల్పోతాం. ఇప్పటికీ సినిమాల కలెక్షన్లలో రాయలసీమని 'సీడెడ్‌' అన్న పదంతోనే కొలమానం చేస్తున్నారు. 1928 లోనే కడప కోటిరెడ్డి అధ్యక్షతన నంద్యాలలో జరిగిన సమావేశంలోనే చిలుకూరి నారాయణరావుగారు ప్రతిపాదించిన 'రాయలసీమ' అన్న నామకరణానికి శతాబ్దం కావస్తున్నా ఇంకా 'సీడెడ్‌' అన్న పదాన్ని విడువడకపోవడం ఎంతటి వివక్ష.
రోజుకు పదులలో జరిగే సీమ రైతుల ఆత్మహత్యల్ని వదిలి, ఏడాదికి ఐదు, పది జరిగే ప్యాక్షన్‌ హత్యలని మాత్రమే లెక్క గడుతూ రెడ్డి, నాయుడు వంటి పేర్లను చివర తగిలించుకుని రక్తపాత ప్రాంతంగా రాయలసీమని ప్రపంచానికి చూపిస్తుంది చిత్రసీమ. దీనిపై కూడా రాచపాళెం తీవ్రంగా స్పందించారు.
చిత్రసీమా!
సీమ అంటే నీకు చులకనా
హత్యలే గాని
ఆత్మహత్యలు కనపడవా?
ఇవే కాకుండా కరువులో భాగంగా కువైట్‌, ముంబై, పూనా, బెంగళూరు వంటి చోట్లల్లో తమ బతుకుల్ని జారవిడుచుకుంటున్నా వైనాన్ని, గంగమ్మ జాతరలు, ప్యాపిలి సంఘటన, వాన రాకపోతే కప్పల పెళ్లిళ్లు, పాత వస్తువుల్ని డప్పు వాయిద్యాల మధ్యన జనమంతా పొలిమేర అవతల విసిరేసి రావడం వంటి సంస్కృతి సంప్రదాయాలతోపాటు దైన్య స్థితుల్ని సైతం నానీలాగా మలిచారు.
'సీమ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం వెలుగు చూడాల్సింది, తీయాల్సింది, తోటి సమాజం గుర్తించాల్సింది ఎంతో ఉందని' నిత్యం అంటుంటారు. తెలంగాణ ఎదుర్కొన్న అవమానాలు, వివక్షత సీమకు ఎదురు కాకూడదనే పరిశోధకులని, రచయితల్ని కలుపుకొని రేపు గురిపెట్టే సమస్యలకి నేడే సమాధానాలు పొగడడానికి పూనుకున్నారు. ఆయననే ఓ ప్రసంగంలో 'సామాన్యుడికి పైమెట్టుగా రచయిత, రచయితకి పైమెట్టుగా విమర్శకుడు ఉండాలంటారు'. ఈ మూడింటిలోనూ నిరాడంబరంగా బ్రతుకుతూ, నిర్విరామంగా సాహిత్య కృషి చేస్తూ, మార్క్సిస్టు సూత్రాలను రచనల్లోనే కాదు జీవితంలోనూ పాటిస్తూ వస్తున్న వ్యక్తి రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి.
 

(అక్టోబరు 16 : ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి జన్మదినం)
-బుగడురు మ.మో.రె. (పరిశోధక విద్యార్ధి)
99898 94308