May 14,2022 06:48

కేంద్రం ఈ చట్టాన్ని సమీక్షిస్తామనడం మంచిదే కానీ, దానికి ఏళ్ళకు ఏళ్ళు కాలయాపన చేస్తేనే కష్టం. ఇప్పటికైనా లా కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా పార్లమెంట్‌ సాక్షిగా రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయడం విజ్ఞత. ఇంకా చెప్పాలంటే, విమర్శకులను వేధించడానికి సాధనాలవుతున్న 'ఉపా' లాంటి అనేక స్వాతంత్య్రానంతర కర్కశ చట్టాలను కూడా సమీక్షిస్తే ప్రజాస్వామ్యానికి మంచిది.

నాటి బ్రిటీష్‌ వలస పాలకుల చట్టమది. రాజకీయ ప్రత్యర్థులను, మేధావులను భయపెట్టే బలమైన ఆయుధంగా మిగిలింది నేడు. నిరసన తెలిపే రైతుల మొదలు విమర్శించే విలేకరుల దాకా ప్రతి ఒక్కరూ పాలకుల దృష్టిలో రాజద్రోహులయ్యారు. అలా అరెస్టయిన ఎంతో మంది జైళ్లలో మగ్గుతున్నారు. కాగా, ప్రభుత్వ సమీక్ష సాగే వరకు ఆ చట్టం అమలును నిలిపి వేయాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన ఆదేశం చరిత్రాత్మకమైనది.
రాజద్రోహ చట్టంలో ఏముంది? ఎందుకు తెచ్చారు?
స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ, అసమ్మతి జ్వాలలను అణిచేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. బ్రిటీషిండియా తొలి లా కమిషనర్‌ థామస్‌ మెకాలే రూపొందించిన ఈ చట్టాన్ని 1890లో 124ఎ సెక్షన్‌ కింద భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీనికింద 1891లో మొదటిసారిగా పత్రికా సంపాదకుడు జోగేంద్ర చంద్రబోస్‌ పై కేసు పెట్టారు. యంగ్‌ ఇండియా పత్రికలో వ్యాసాలు రాసినందుకుగాను 1922లో గాంధీజీ, మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ను కూడా ఈ దేశద్రోహం చట్టం కింద అరెస్ట్‌ చేశారు.
బ్రిటీష్‌ ప్రభుత్వం కంటే తానేమీ తక్కువ కాదని 2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి నిరూపించుకుంటోంది. తనకు రాజకీయంగా, సైద్ధాంతికంగా ఎదురు తిరిగి విమర్శలు ఎక్కుపెట్టేవారిపై దేశద్రోహ చట్టాన్ని (ఐపిసి సెక్షన్‌ 124ఏ) విచక్షణారహితంగా ప్రయోగిస్తోంది. ఇందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ), నేషనల్‌ రికార్డ్స్‌ ఆఫ్‌ క్రైమ్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) వెల్లడించిన గణాంకాలే నిదర్శనం. ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం 2014-2020 మధ్య కాలంలో ఈ చట్టం కింద 399 మందిపై కేసులు నమోదు చేశారు. 548 మందిని అరెస్టు చేశారు. అయితే కేవలం 8 మంది మాత్రమే దోషులని తేలడం గమనార్హం. కేసుల నమోదు బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువగా వుంది. 2010-2020 మధ్య బీహార్‌లో 168, తమిళనాడులో 139, యు.పి లో 115, జార్ఖండ్‌లో 62, కర్ణాటకలో 50, ఒడిశాలో 30 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే 2010-2020 మధ్య 11 వేలమందిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. 2019లో జార్ఖండ్‌ లోని కుంటి జిల్లాలో 10 వేల మంది అడవిబిడ్డలపై నాటి బిజెపి ప్రభుత్వం రాజద్రోహం కేసులు పెట్టింది. 2020లో అత్యధికంగా 95 శాతం కేసులు పెండింగ్‌లో వున్నాయని నివేదికలు చెబుతున్నాయి. స్టాన్‌స్వామి వంటి వారు కారాగారం లోనే కనుమూయడం దయనీయమైనది. ఈ చట్టం కింద ప్రస్తుతం దేశంలో 13 వేల మంది జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్నారంటే.. ఎంత దుర్మార్గమో అర్థమవుతుంది. 2021 ఏప్రిల్‌లో యు.పి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 'పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా' విద్యార్థి విభాగం నేత కె.కె. రవూఫ్‌ షరీఫ్‌ సహా 8 మందిపై రాజద్రోహం, నేరపూరిత కుట్ర, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నారన్న అభియోగాలు నమోదు చేశారు.
ప్రశ్నించిన 'సుప్రీం'
మోడీ ప్రభుత్వం దేశద్రోహ చట్టాన్ని (ఐపిసి సెక్షన్‌ 124ఎ) బలంగా ప్రయోగిస్తున్నది. దాంతో, సుప్రీంకోర్టులో వందలాది పిటిషన్లు వేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా 'దేశద్రోహ చట్టం' అవసరమా? అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేగాక, దాదాపు 150 ఏళ్లనాటి ఈ చట్టం అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కోర్టు తీర్పును ప్రభావితం చేసేలా మోడీ సర్కారు ఎన్ని ట్రిక్కులు వేసినా, చట్టాన్ని నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు 11వ తేదీన ఆదేశాలు జారీచేసింది. చట్టంపై కేంద్ర ప్రభుత్వం పున:సమీక్ష పూర్తయ్యి, కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఈ చట్టం కింద ఎలాంటి కేసులు, చర్యలు తీసుకోవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అలాగే, ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలు, పెండింగ్‌లో వున్న ట్రయళ్లను కూడా నిలిపేస్తున్నట్టు 'సుప్రీం' తెలిపింది. సెక్షన్‌ 124ఎ కింద కొత్తగా కేసు నమోదైనవారు, ఇప్పటికే జైలులో ఉన్నవారు బెయిల్‌ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కూడా పేర్కొంది. కాగా సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో రాజద్రోహం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న పలువురు ప్రముఖులకు ఊరట లభించినట్లయింది.
కేంద్రం ఈ చట్టాన్ని సమీక్షిస్తామనడం మంచిదే కానీ, అందుకు ఏళ్ళకు ఏళ్ళు కాలయాపన చేస్తేనే కష్టం. ఇప్పటికైనా లా కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా పార్లమెంట్‌ సాక్షిగా రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయడం విజ్ఞత. ఇంకా చెప్పాలంటే... విమర్శకులను వేధించడానికి సాధనాలవుతున్న 'ఉపా' లాంటి అనేక స్వాతంత్య్రానంతర కర్కశ చట్టాలను కూడా సమీక్షిస్తే ప్రజాస్వామ్యానికి మంచిది.

/ వ్యాసకర్త సెల్‌ : 9494076092 / దాస్‌ వంతాల

'రాజద్రోహం' ఇక చాలు