May 29,2023 21:55

బైకు ర్యాలీలో అభివాదం చేస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

ప్రజాశక్తి-సాలూరు : రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తే ఓర్వలేకనే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దురహంకార వ్యాఖ్యలు చేశారని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. సోమవారం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా నియోజకవర్గ పరిధిలోని మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో ఆయన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తన నివాసం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగింది. బోసుబొమ్మ జంక్షన్‌లో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు సమాధుల నిర్మాణానికి పనికొస్తాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమరావతిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం నిర్మించాలని చంద్రబాబు కలలు కన్నారని చెప్పారు. పేదలకు మేలు చేస్తుంటే ఓర్వలేకనే చంద్రబాబు నాయుడు తప్పుడు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. కార్యక్రమంలో అర్బన్‌బ్యాంక్‌ అధ్యక్షుడు జర్జాపు ఈశ్వరరావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, పట్టణ మాజీ అధ్యక్షుడు జర్జాపు సూరిబాబు, జగనన్న సచివాలయాల కన్వీనర్‌ గిరిరఘు, కౌన్సిలర్‌ పప్పల లక్ష్మణరావు, పాచిపెంట మండల నాయకులు పి.చినబాబు, జి.ముత్యాల నాయుడు, మక్కువ మండలం నాయకులు మావుడి రంగునాయుడు, సాలూరు మండలం సీనియర్‌ నాయకులు దండి శ్రీనివాసరావు, సువ్వాడ భరత్‌ శ్రీనివాస్‌, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ పిరిడి రామకృష్ణ, అర్బన్‌బ్యాంక్‌ డైరెక్టర్‌ పువ్వుల భరత్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
బలిజిపేట: చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా బలిజిపేట మండల కేంద్రం నుంచి బర్లి రకు నిరసన భారీ బైక్‌ ర్యాలీ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే జోగారావు సారధ్యంలో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు టిడిపి దుర్మార్గపు సర్వేలను నిరసిస్తూ చంద్రబాబు వైఖరి మారాలని, పేదల ఇళ్ల స్థలాలను స్మశానంతో పోల్చడాన్ని ఆయన దురహంకారానికి పేద బడుగు బలహీన వర్గాల పై ఉన్న చిన్న చూపుకు నిదర్శనం అని నిలదీస్తూ, డౌన్‌ డౌన్‌ చంద్రబాబు అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సుమారుగా 10 కిలోమీటర్ల మేర చేపట్టిన ర్యాలీ కార్యక్రమం బర్లి గ్రామం మీదగా పనదాన రహదారి వద్దకు చేరుకొని అక్కడ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యేమాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 31 లక్షల 50 వేల మందికి ఇళ్ల స్థలాలను ఇవ్వడం జరిగిందని అదేవిధంగా ఇటీవలనే అమరావతి ప్రాంతంలో కూడా 50 వేళ పైచిలుకు పేదలకు 1400 ఎకరాల్లో పేదలకు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. దీంతె తమ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందోనన్న భయంతో పేదల ఇళ్ల స్థలాలపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారని అన్నారు. ఇది ఎంత మాత్రం సభ్య సమాజంలో తగదని, చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా ఈ భారీ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో బలిజిపేట, సీతానగరం మరియు పార్వతిపురం మండలాల ప్రజా ప్రతినిధులు జడ్పిటిసిలు, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మండలాల పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, స్టేట్‌ డైరెక్టర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, పిఎస్సిఎస్‌ చైర్మన్లు, వైసీపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు, గహ సారథులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.