Jul 29,2021 20:17

సర్పంచ్‌ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అప్పలనర్సయ్య

ప్రజాశక్తి - జామి : రాజకీయాలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందజేయాలని, ఇందుకు అధికారులు, సర్పంచులు సమన్వయంతో పని చేయాలని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఆదేశించారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి విజయకుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలో 12వేల ఇళ్లు మంజూరయ్యాయని, ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే మంత్రులతో చర్చించి వారికి కూడా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే శ్రావణమాసంలోగా ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. గ్రామ సర్పంచులను గౌరవించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే అర్హులైన వారిని అడ్డుకోవద్దని సర్పంచులకు దిశానిర్దేశ చేశారు. దరఖాస్తులపై సర్పంచుల సంతకాలు అవసరం లేదని, కానీ వారి దృష్టిలో పెట్టాల్సిన బాధ్యత అధికారులకు ఉందని చెప్పారు. భీమసింగి నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక రీచ్‌లను గుర్తించాలని, ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత ఉండకూడదని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌శాఖ ఎఇ రవికుమార్‌ సమావేశానికి డుమ్మా కొట్టిన నేపథ్యంలో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఇకపై అనుమతి లేకుండా సమావేశాలకు ఎగ్గొట్టొదని హెచ్చరించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన డిసిసిబి డైరెక్టర్‌ పాండ్రంగి సంజీవిని దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ నీలకంఠేశ్వరరావు, ఎంపిడిఒ సతీష్‌, వైసిపి మండల కన్వీనర్‌ గొర్లి రవికుమార్‌, గజపతినగరం నియోజవర్గంలోని సర్పంచులు, మండల శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలపై దృష్టిసారించాలి : ఎంపిడిఒ
బొండపల్లి :
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని ఎంపిడిఒ పి.త్రివిక్రమరావు కోరారు. గురువారం మండలంలోని గొట్లాం, అంబటివలస సచివాలయాలను పరిశీలించారు. ఈసందర్భంగా జగనన్న కాలనీ నిర్మాణంలో భాగంగా గృహనిర్మాణాలు ఏదశలో ఉన్నాయో సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు నారాయణ, సత్యవతి ఉన్నారు.