Jan 03,2021 08:19

    'కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ/ ఇతడే దిక్కని మొక్కని వాడికి/ దిక్కు మొక్కు లేదంటండీ/ ... పాత దేవుడు పట్టిన తప్పులు/ ఒప్పులకుప్పలు చేస్తాడండీ/ కొత్త దేవుని కొలిచిన వారికి/ కొక్కొక్కొ కొదవే లేదండీ' అంటూ... సినీకవి వేటూరి రాసిన ఓ పాటలోని ఈ వాక్యాలు మన కొత్తదేవుడికి సరిగ్గా సరిపోతాయి. నేలకు స్వర్గం దించానంటాడు... ఆ స్వర్గాన్ని ప్రజలందరికీ పంచానంటాడు. ఆ పైన నెత్తిన చేతులు పెడతాడు. స్వర్గమేదని ఎవరైనా అడిగితే... నువ్వు రాజకీయం చేస్తున్నావ్‌ అంటాడు. దేశం గురించి దేశభక్తి గురించి గొప్పగా చెబుతాడు. చివరకు 'కుక్క పిల్లలను పెంచుకోవాలనుకునే వారు... ఇండియన్‌ బ్రీడ్‌ కుక్కపిల్లలనే పెంచుకోవాలి. వాటికి భారతీయ పేర్లు పెట్టాలి'... అని పారిశ్రామిక వేత్తలతో నిర్వహించిన 'మన్‌ కీ బాత్‌'లో మన కొత్తదేవుడు ప్రవచించారు. 'వేషమూ మార్చెను.. భాషనూ మార్చెను/ మోసము నేర్చెను.. తలలే మార్చెను..' అంటారు పింగళి వారు. 130కోట్ల మంది ప్రజలకు నిత్యావసరం అయిన ఆహార ధాన్యాలను మాత్రం విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలిట. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే... వాడికి దేశభక్తిలేదు, వాడు రాజకీయం చేస్తున్నాడు... అంటూ రా- అంటే రాక్షసంగా, జ- అంటే జనానికి, కీ- అంటే కీడుచేసే, యం- అంటే.. యంత్రాంగం' గా మార్చేశాడు.
      దేశ రాజధానిలో... నడిరోడ్డుపైన 38 రోజులుగా రైతులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తోంటే, బిజెపి మాత్రం దేశవ్యాప్తంగా 500పైగా మీటింగులు పెట్టి, రైతు ఉద్యమంపై తన అక్కసునంతా వెళ్లగక్కుతూ, తన అనుకూల మీడియాతో తప్పుడు కథనాలు రాయిస్తూ... ఈ పోరాటం కేవలం మద్దతు ధర కోసమే అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. స్వావలంబన భారత్‌, ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటూ హృదయంలేని ఆత్మనిర్భరం గురించి చిలకపలుకుల్లా వల్లెవేస్తున్నారు. ఈ దేశానికి హృదయం రైతులు. వారి హృదయస్పందన వినండీ... అంటే-రాజకీయం అంటున్నారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి అంటున్నారు. రైతుల్ని రెచ్చగొట్టి పోరాటంలోకి దింపుతున్నారని ప్రచారం చేస్తున్నారు. మా ఉద్యమంలో రాజకీయ నాయకులుగానీ, రాజకీయ పార్టీలు గానీ పాల్గొనడంలేదని, వారు బయటినుండే మద్దతు ఇస్తున్నారని రైతులు చెబుతున్న మాటలు మోడీకి గానీ, మోడీ మీడియాకిగానీ వినబడనట్లు నాటకం ఆడుతున్నారు. కానీ, మీరు చేస్తున్నదని తప్పు అని దేశంలో ఎవరు మాట్లాడినా... మీరు రాజకీయం చేస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు. బయటి దేశాలు మాట్లాడితే...ఇది మా అంతర్గత వ్యవహారం...మీకు అనవసరం అంటున్నారు. అంటే... మేము చెప్పిందే వేదం... మా మాటే శాసనం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రైతు ఉద్యమాన్ని చీల్చడానికి మోడీ మంత్రాంగం అంతా విఫలం కావడంతో రాజకీయం చేస్తున్నారంటూ కొత్తపల్లవి నందుకున్నారు.
    దేశమంతా ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఈ పోరాటంలో నెగ్గేది కార్పొరేట్‌ రాజకీయమా..? రైతు రాజకీయమా? అని. స్వావలంబన, ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటూ... స్వదేశీ వస్తువులనే కొనండని ఒక వైపు చెబుతూనే, మరోవైపు ఈ దేశంలో రైతు ఏం పండించాలి. ఏ పంట వేయాలి, ఏ విత్తనాలు కొనాలి. ఏ ఎరువులు వాడాలి వంటివన్నీ కార్పొరేట్‌ సంస్థల గుప్పెట్లో పెడుతున్నారు. దిగుమతి ఆధారిత వ్యవసాయం చేయమంటున్నారు. చివరకు తిండి గింజల కోసం భిక్షమెత్తాల్సిన పరిస్థితి తెస్తున్నారు. ఇది జనాన్ని మోసం చేయడం కాదా? అంటే... రాజకీయం చేస్తున్నారంటూ ఎదురుదాడి చేయిస్తున్నారు. రాజకీయం చేసే హక్కు జనానికి లేదా? రాజకీయాల గురించి మాట్లాడే హక్కు మోడీ ఒక్కడికే పేటెంటా? రైతులకు రాజకీయాలు మాట్లాడే హక్కులేదా? ఒక ప్రజాస్వామ్య చర్చకు, హేతుబద్దతకు అవకాశం లేకుండా ఎదుటివారిని నోరు మూయించే విధంగా పోరాటంలో రాజకీయాలు వుండకుండా వుండవు. అందుకే అంటాడు లెనిన్‌...'ప్రతి పోరాటమూ రాజకీయమే' అని. ఏ రాజకీయ పార్టీ రైతు ఉద్యమం గురించి మాట్లాడకూడదంటే, ముందు బిజెపి ఈ ఉద్యమం గురించి మాట్లాడటం, మీటింగులు పెట్టడం మానెయ్యాలి. రామాలయం కట్టాలని దేశమంతా అల్లకల్లోలం చేస్తే...అది ధర్మరక్షణా? అదే రైతుల విషయానికొచ్చేసరికి రాజకీయమా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? వీరజవాన్ల గురించి మాట్లాడే మోడీ... తమ మెడల్స్‌ను ఆ జవాన్లు వెనక్కి ఇచ్చేస్తుంటే ఎందుకు ఆలోచించడంలేదు? వారూ రైతు ఉద్యమంలో భాగమౌతున్న విషయం ఎందుకు తలకెక్కడంలేదు? మోడీ సర్కార్‌ అవలంభిస్తోన్న కపటత్వాన్ని, కుటిలనీతిని నగంగా ప్రపంచం ముందు ఆవిష్కరించిందీ రైతు ఉద్యమం. మోడీ చేస్తున్న రాజకీయ వ్యవసాయాన్ని నడిరోడ్డు మీదనే దున్నేసి ఉద్యమాల విత్తనాలు వేస్తున్నారు రైతులు. ఈ విత్తనాలు మొలవడం ఖాయం. ఈ మొలకలు కొత్త ఉద్యమాలకు ప్రేరకాలు... స్ఫూర్తిదాయకాలు.