Oct 17,2020 12:57

రాజమహేంద్రవరం : రాజమండ్రి ఆంధ్రా పేపర్‌ మిల్లు ఎదుట ఉద్రిక్తత నెలకొంది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని, యాజమాన్యం నిరంకుశ వైఖరిని విడనాడాలంటూ.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్‌ లిమిటెడ్‌ కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. కార్మికులకు మద్దతుగా ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌ నిరవధిక దీక్షకు దిగారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఈ దీక్ష నిరవధికంగా కొనసాగుతోంది. అయినప్పటికీ యాజమాన్యం దిగిరాకపోవడంతో శనివారం కూడా ఈ దీక్ష కొనసాగింది. ఈ దీక్షకు మద్ధతుగా జక్కంపూడి గణేష్‌ యువసేన ఆధ్వర్యంలో వేలాది మంది యువకులు ఈరోజు నగరంలో బైకు ర్యాలీ చేశారు. ఉదయం నుంచే మిల్లు వద్దకు చేరుకుని యువకులు పెద్ద ఎత్తున నినాదాలతో ఆందోళనకు దిగారు. దీంతో మిల్లు ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు రాజమహేంద్రవరంలోని రహదారులన్నిటిలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించేందుకు, మిల్లు ఎదుట ఆందోళనకారులను కట్టడి చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. కార్మిక సంఘాల నాయకులు పేపరుమిల్లు యాజమాన్యంతో పలుదఫాలు చర్చలు జరిపారు. యాజమాన్యం ఎంతకీ దిగిరాకపోవడంతో సాయంత్రం అయిదు గంటలకు మిల్లులోనే నిరవదిక దీక్షకు దిగారు.

సమస్య పరిష్కరించే వరకు దీక్ష ఆగదు : ఎమ్మెల్యే రాజా

ఎంఎల్‌ఎ రాజా మాట్లాడుతూ, కార్మికశాఖ, ప్రభుత్వ అధికారుల వద్ద అంగీకరించిన అంశాలను కూడా అమలు చేయకుండా నిరంకుశంగా వ్యవహరించడం సరికాదని, సమస్య పరిష్కారం అయ్యేవరకు దీక్ష విరమించబోమని స్పష్టం చేశారు. తక్షణమే కార్మికులకు నష్టం చేసే తప్పుడు ఒప్పందాలను ఆపాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం వైఖరి విడనాడే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

యాజమాన్యం నిరంకుశం వీడాలి : అరుణ్‌
పేపర్‌ మిల్లు యాజమాన్యం నిరంకుశ నిర్ణయాలకు స్వస్తి చెప్పి, కార్మికులను పర్మినెంటు చేయాలని అరుణ్‌ డిమాండ్‌ చేశారు. 2019 జనవరి ఒకటిన యాజమాన్యానికీ, అప్పటి గుర్తింపు సంఘానికీ మధ్య 12 (3) ప్రకారం 84 మంది కాంట్రాక్ట్‌ కార్మికులను ఇన్‌ప్లాంట్‌ ట్రైనీలుగాను, 55 మంది కార్మికులను బదిలీలుగానూ సీనియారిటీ ఆధారంగా తీసుకునేందుకు ఒప్పందం జరిగింది.. ఈనేపథ్యంలో కోర్‌ విభాగాల్లో 55 మందిని పర్మినెంట్‌ చేయడానికి యాజమాన్యం ఒప్పందం చేసిందన్నారు. కానీ యాజమాన్యం ఒప్పందాన్ని అమలు చేయకుండా తాత్సారం చేస్తూ వచ్చిందన్నారు. చివరికి ఒప్పందానికి భిన్నంగా సీనియారిటీని పక్కన పెట్టి అడ్డగోలుగా ఆర్డర్లు ఇవ్వడం పట్ల కార్మికులు తిరుగుబావుటా ఎగురవేశారన్నారు. యాజమాన్యంతో చర్చలు జరిపినా ఫలితం లేదని, తాజాగా 50 ఏళ్లు దాటిన వారిని, మహిళలను, సెక్యూరిటీ కార్మికులను తీసుకోబోమని, అనేక షరుతులు పెట్టి, అనుకూల యూనియన్లతో ఒప్పందానికి యాజమాన్యం ప్రయత్నించిందని అన్నారు. అందువల్లే దీక్షకు దిగినట్లు స్పష్టం చేశారు.

rajahmundry paper mill vadda nirasanarajahmundry paper mill vadda nirasana