Apr 30,2022 10:01

పౌరసత్వ సవరణ చట్టానికి ఎదురైన రాజ్యాంగపరమైన సవాళ్ళకు కూడా ఇప్పటికి రెండేళ్ళకు పైగా కాలం గడిచిపోయినప్పటికీ కోర్టు నుండి ఎలాంటి స్పందన లేదు. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న ఇతర కీలకాంశాలు చాలా వున్నాయి. వాటిల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టానికి చేసిన సవరణలు వంటివి వున్నాయి. ప్రజలను నిరవధికంగా నిర్బంధించడానికి అనుమతించే సెక్షన్‌ 43(డి)(5) వంటి హేయమైన క్లాజుల పట్ల కూడా ఎలాంటి దృష్టి పెట్టకుండానే గడిచిపోతోంది. ఇటువంటి అత్యంత కీలక సమయంలో పౌరుల రాజ్యాంగ, ప్రాథమిక హక్కుల పరిరక్షణ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం అత్యవసరం. కాని ఈ విధమైన 'న్యాయ ఎగవేత' ధోరణి తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది.


రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడతామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు.
ఈ కేసును త్వరగా విచారించాలని సీనియర్‌ న్యాయవాదులు చేసిన అభ్యర్ధనపై జస్టిస్‌ రమణ పై రీతిన స్పందించారు. అంతేగాక ఈ కేసును విచారిస్తున్న ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఒకరు రిటైర్‌ అయినందున తిరిగి బెంచ్‌ను పూర్తి స్థాయిలో నియమించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు. జులైలో విచారణను పునరుద్ధరించాలంటే ఈలోగానే ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి మరో న్యాయమూర్తిని బెంచ్‌లో నియమించాల్సి వుంటుంది. కానీ ఆగస్టు 26న ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేయనున్నారు. అంటే ఈ కేసు లోని అంతులేని జాప్యం ఇలాగే కొనసాగుతూ వుంటుందని దీనర్ధం.
2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్‌పై రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే రెండు సంవత్సరాల 9 మాసాలు గడిచిపోయాయి. ఇటువంటి కీలకమైన రాజ్యాంగ అంశానికి సంబంధించిన కేసులో విచారణను అత్యున్నత న్యాయస్థానం ఇలా ఆలస్యం చేయడం ఎంత మాత్రమూ సమర్ధనీయం కాదు. ఈ కాలంలోనే, వివిధ చర్యలను అమలు చేస్తూ, కొత్త చట్టాలను రూపొందిస్తూ కేంద్ర ప్రభుత్వం చాలా మార్పులు తీసుకు వస్తోంది. కేంద్ర పాలిత ప్రాంత పరిధిలో కుదించబడిన అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన కూడా కొద్దో గొప్పో పూర్తయింది.
జమ్మూ కాశ్మీర్‌ పిటిషన్లు అత్యంత విస్తృతమైన రాజ్యాంగపర చిక్కుముడులకు సంబంధించినవి. రాష్ట్రపతి పాలనను విధించడం ద్వారా ఒక రాష్ట్రం స్వభావాన్ని కేంద్రం ఏకపక్షంగా మార్చవచ్చా? కేంద్ర రాష్ట్ర సంబంధాలను నొక్కి చెప్పే ఫెడరల్‌ సూత్రం మౌలిక పునాది ఇక్కడ పణంగా పెట్టబడుతోంది. ఇంతటి కీలకమైన అంశంపైన సుప్రీం కోర్టు ఎలాంటి జ్యుడీషియల్‌ ప్రకటన చేయకుండానే...కేంద్ర ప్రభుత్వ పక్షపాతంతో కూడిన సంకుచిత, ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్ళేందుకు అనుమతించింది.
కోర్టు ముందు ఇతర కీలక రాజ్యాంగ సంబంధ కేసులు పెండింగ్‌లో వున్నాయి. ఎలక్టోరల్‌ బాండ్లను సవాలు చేస్తున్న పిటిషన్లు నాలుగేళ్ళకు పైగా కోర్టులో పెండింగ్‌లో పడి మూలుగుతున్నాయి. ఈలోగా 2018లో లోక్‌సభలో చట్టంగా రూపొందడం, తర్వాత వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అజ్ఞాత విరాళాల వ్యవస్థ ద్వారా వేలాది కోట్ల రూపాయలు పాలక పార్టీకి చేరడం జరిగిపోయింది. ఇది, ఎన్నికల క్రమాన్ని ప్రభావితం చేసింది. స్వేచ్ఛా, పారదర్శక రీతిలో ఎన్నికలు జరగడాన్ని దెబ్బ తీస్తూ, పాలక పార్టీకి అంతర్గతంగా ఒక అవకాశాన్ని కల్పించింది. అయినప్పటికీ, రాజ్యాంగ కోర్టుకు ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, తీర్పు చెప్పేందుకు సమయం లభించలేదు.
పౌరసత్వ సవరణ చట్టానికి ఎదురైన రాజ్యాంగపరమైన సవాళ్ళకు కూడా ఇప్పటికి రెండేళ్ళకు పైగా కాలం గడిచిపోయినప్పటికీ కోర్టు నుండి ఎలాంటి స్పందన లేదు. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న ఇతర కీలకాంశాలు చాలా వున్నాయి. వాటిల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టానికి చేసిన సవరణలు వంటివి వున్నాయి. ప్రజలను నిరవధికంగా నిర్బంధించడానికి అనుమతించే సెక్షన్‌ 43(డి)(5) వంటి హేయమైన క్లాజుల పట్ల కూడా ఎలాంటి దృష్టి పెట్టకుండానే గడిచిపోతోంది.
ఇటువంటి అత్యంత కీలక సమయంలో పౌరుల రాజ్యాంగ, ప్రాథమిక హక్కుల పరిరక్షణ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం అత్యవసరం. కాని ఈ విధమైన 'న్యాయ ఎగవేత' (జుడిషియల్‌ ఎవేజన్‌) ధోరణి తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది.
భారత ప్రధాన న్యాయమూర్తి తన పదవిని చేపట్టిన తొలి రోజుల్లో న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని, రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికిగల ప్రాముఖ్యతను నొక్కి చెప్పినపుడు...కోర్టులో పెండింగ్‌లో వున్న అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ సంబంధిత కేసులను శీఘ్రగతిన పరిష్కరిస్తారని ఆశించాం. దాంతో ఈ ఆవేదన మరింత ఎక్కువగా వుంది.


( 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)