Apr 16,2021 07:52


న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ సంస్థల విధ్వంసం లేదా అణిచవేత అప్రతిహతంగా కొనసాగుతోంది. భారత ఎన్నికల కమిషన్‌ (ఇసి)కి జరిగిందానికంటే ఇక వేరే ఉదాహరణలు ఇందుకు అవసరం లేదు. కేరళ నుండి ఖాళీగా వున్న మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలపై ఇసి అనుసరిస్తున్న వైఖరి ఒక స్పష్టమైన వాస్తవాన్ని మన ముందుకు తీసుకువచ్చింది. మోడీ ప్రభుత్వ అభీష్టానికి అనుగుణంగా కమిషన్‌ నడుచుకుంటుందన్నదని దీనితో వెల్లడైంది. ఒక రాష్ట్రం నుండి ఎగువ సభకు ఖాళీలను భర్తీ చేయడానికి చాలా సర్వసాధారణంగా జరిగే ఎన్నికకు సంబంధించి కమిషన్‌ వింతైన వ్యవహార శైలి మొత్తంగా ఈ విషయాన్ని విశదీకరిస్తోంది.

ఏప్రిల్‌ 12న ఎన్నికలు జరుగుతాయని తొలుత ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. కానీ వారం రోజుల తర్వాత, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పంపిన ఒక ప్రస్తావనను పరిశీలించేందుకు ఎన్నికల క్రమాన్ని ఆపుతున్నట్లు ప్రకటించింది. ఎన్నికలను ఇలా నిలుపుచేయడంపై ఇసి నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేరళ అసెంబ్లీ కార్యదర్శి, సిపిఎం ఎమ్మెల్యే కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతమున్న అసెంబ్లీ సభ్యుల హక్కును కాలరాయవద్దని వారు వాదించారు. సభ్యుల పదవీ కాలం ముగియడానికి ముందుగానే ఎన్నికలను నిర్వహిస్తామని ఇసి తరపు న్యాయవాది తొలుత కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ, దాన్ని రికార్డు చేయమని ఆదేశించేసరికి వెనుకంజ వేశారు. కొత్త అసెంబ్లీ కోసం ఏప్రిల్‌ 6న ప్రజలు ఓటు వేసిన నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని సూచిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ పంపిన లేఖను ఆ తర్వాత జరిగిన విచారణలో ఎన్నికల కమిషన్‌ ఉదహరించింది. కేంద్రం చేసిన సూచనను తాము ఆమోదించామని ఇసి రాతపూర్వకంగా అంగీకరించింది. హైకోర్టు ఈ వైఖరిని తోసిపుచ్చింది. మే 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేలోగా ఎన్నికలు నిర్వహించాలని ఇసిని ఆదేశించింది. ఆ రకంగా మూడు సీట్లలో రెండింటిని గెలిచేందుకు ఎల్‌డిఎఫ్‌కు గల అవకాశాలను హరించాలని మోడీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని కోర్టు భగం చేసింది. మోడీ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించేందుకు ఇసి ఎంత దూరం వెళుతుందనేది ఈ అధ్యాయంతో రుజువైంది.
జమ్ముకాశ్మీర్‌లోనూ..
ప్రభుత్వ అవసరాలను ఎన్నికల కమిషన్‌ నెరవేర్చడమనేది ఇంతకుమందే ప్రారంభమైంది. 2019 ఏప్రిల్‌ామే మాసాల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటుగా జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇసి తీసుకున్న నిర్ణయం ఇటువంటిదే. లోక్‌సభ ఎన్నికలతో పాటుగా జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికలను నిర్వహించరాదని ఇసి నిర్ణయించింది. 2018 నవంబరు నుండి రాఫ్ట్రం రాష్ట్రపతి పాలనలో వుంది. అందువల్ల లోక్‌సభతో పాటే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని ఊహించడం సహజమే. కానీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకపోవడానికి భద్రతా పరమైన కారణాలను ఇసి పేర్కొంది. ఈ చర్య తాలుకూ సుదీర్ఘ పర్యవసానాలు త్వరలోనే కనిపించాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన మూడు మాసాల కాలంలోనే మోడీ ప్రభుత్వం 370వ అధికరణను రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీకి తెలియచేయాల్సిన రాజ్యాంగబద్ధమైన ఆవశ్యకతను కూడా చాలా తెలివిగా తప్పించారు. ఎందుకంటే అక్కడ గవర్నర్‌ పాలన వుంది. అసెంబ్లీ స్థానంలో వున్న గవర్నర్‌తో దీనిపై సంప్రదించడం సరిపోతుంది కనుక అది చేశారు. ఆ రోజున ఆ నిర్ణయాన్ని కేవలం భద్రతాపరమైన అవరోధాలను సాకుగా చూపించి తీసుకున్నట్లు అప్పటికి కనిపించినా, దాని వెనుక గల ఉద్దేశ్యం, మోడీ ప్రభుత్వ విస్తృత ప్రయోజనాలను నెరవేర్చడమే.
ఎన్నికల బాండ్లపై..
ఎన్నికల బాండ్ల పథకంపై ఇసి వైఖరి ఇందుకు మరో ఉదాహరణ. 2017లో, ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని రూపొందించినపుడు, రాతపూర్వకంగా తమ అభిప్రాయాన్ని తెలియచేయాల్సిందిగా ఇసిని కోరింది. అందుకు ఇసి ఈ పథకంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల నిధులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పారదర్శకతపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని కలగచేస్తుందని హెచ్చరించింది. ఎన్నికల బాండ్ల ద్వారా అలాగే, రాజకీయ పార్టీలకు నిధులు అందిచేందుకు భారత్‌లో పనిచేస్తున్న విదేశీ కంపెనీలను అనుమతిస్తూ చట్టానికి సవరణ తీసుకురావడాన్ని కూడా ఇసి అభ్యంతరం వెలిబుచ్చింది. అయితే, గతనెల్లో మరో విడత బాండ్ల విడుదల పై స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ముందుకు ఒక పిటిషన్‌ వచ్చింది. ఆ స్టే ఇచ్చేందుకు ఇసి తిరస్కరించింది. ఎన్నికల బాండ్లకు తాము వ్యతిరేకం కాదని, తమకు పారదర్శకత మాత్రం కావాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై ప్రధాన పిటిషన్లు విచారించే సమయంలో ఈ పారదర్శకతా సమస్యను పరిష్కరించవచ్చు. ఇక్కడ మరోసారి, ఈ పథకం పట్ల తన తీవ్ర అభ్యంతరాల విషయంలో ఇసి రాజీపడింది.
బెంగాల్‌లోనూ వివాదస్పద వైఖరే..
పశ్చిమ బెంగాల్‌లో 8 దశల్లో ఎన్నికల క్రమంపై కూడా ఇసి వ్యవహార శైలి వివాదాస్పదంగానే వుంది. నలుగురు మరణించడానికి దారి తీసిన సీతాకుల్చి ఘటనలో రాష్ట్ర పరిశీలకులు అందచేసిన తప్పుడు నివేదిక ఆధారంగా కేంద్ర బలగాల తప్పేమీ లేదని తేల్చి చెప్పింది. వాస్తవికంగా జరిగిందేమిటో నిర్ధారించుకోవడానికి కూడా కమిషన్‌ ప్రయత్నించలేదు. ఇక బిజెపి, నరేంద్ర మోడీ, అమిత్‌షా నేతృత్వంలో తన సహజ ధోరణిలో కఠినమైన, రెచ్చగొట్టే మతోన్మాద ప్రచారాన్ని చేపట్టింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జరిగినట్లుగా, బిజెపి అగ్ర నాయకత్వం ఎవరిపై కూడా ఈసారి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు కేసులు నమోదవలేదు. ఇందుకు విరుద్ధంగా మమతా బెనర్జీ చేసే ప్రసంగాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నాయంటూ ఆమె ఎన్నికల ప్రచారంపై 24గంటల నిషేధం విధించారు.
స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు జరగడానికి ముందు కావాల్సింది నిష్పాక్షికంగా వ్యవహరించే ఎన్నికల కమిషన్‌. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించడం దాని బాధ్యత. నేరస్తులను కఠినంగా ఎదుర్కొనాల్సి వుంది. అన్నిస్థాయిల్లో ప్రభుత్వ జోక్యాన్ని ప్రతిఘటించాల్సి వుంది. దశాబ్దాల తరబడి ఈ విషయంలో విశ్వసనీయమైన రికార్డును కలిగివున్న కమిషన్‌ ప్రస్తుతం ఆ పేరుప్రతిష్టలను కోల్పోయే ప్రమాదంలో వుంది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులకు కమిషన్‌ బాగా అలవాటు పడినట్లుంది.
స్వయంప్రతిపత్తిని బలహీనపర్చొద్దు..
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో, ఎన్నికల కమిషనర్లలో ఒకరైన అశోక్‌ లావాసా స్వతంత్ర ఆలోచనా దృక్పధాన్ని ప్రదర్శించారు. మోడీ, అమిత్‌ షాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసుల్లో కమిషన్‌ తీసుకున్న నిర్ణయాలపై దాదాపు ఐదుసార్లు తన అసమ్మతిని నమోదు చేశారు. ఆ తర్వాత లావాసా భార్య, కుమారుడు, సోదరి అందరూ ఆదాయపన్ను విచారణలను ఎదుర్కొంటున్నారు. వీటి గురించి మీడియాలో బాగా ప్రచారమైంది కూడా. ఆసియాభివృద్ధి బ్యాంక్‌లో పదవిని ఆమోదించి, 2020 జులైలో కమిషనర్‌గా లావాసా రాజీనామా చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సునీల్‌ అరోరా రిటైరయ్యారు. లావాసా వైదొలగకపోతే ఆయనే సిఇసిగా అయివుండేవారు. స్వతంత్ర, స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థగా కమిషన్‌ పనితీరులో కీలకమైన బలహీనతను ఇది తీసుకువచ్చింది. సిఇసి, ఇతర కమిషనర్లను ఆ రోజున వున్న ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ చేతుల్లో వుంటుంది. ప్రారంభం నుండి, సివిల్‌ సర్వెంట్లు లేదా సర్వీస్‌ నుండి రిటైరైన వారిని కమిషనర్లుగా నియమించేవారు. ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వ్యక్తులకు అనుగుణంగా, వారికి సలాములు కొట్టే సివిల్‌ సర్వెంట్లు ఈ పదవులను పొందడం సులభం. అన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థలను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు మోడీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తోంది. ప్రభుత్వ పొడిగింపుగా ఇసి మారే ప్రమాదముంది.
రాజీ పడితే ప్రజాస్వామ్యానికే ప్రమాదం
రాజ్యాంగంలోని 324వ అధికరణ కింద, పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన పర్యవేక్షణ, దిశ,నియంత్రణ వంటి కర్తవ్యాలన్నింటినీ ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సి వుంది. ఇసి ఈ విషయంలో రాజీపడినట్లైతే, మొత్తంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. మోడీ ప్రభుత్వ కబంధ హస్తాల నుండి ఇసికి స్వేచ్ఛ కల్పించడం చాలా ముఖ్యమైన అవసరం. అందుకోసం, మొదటి చర్యగా, ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేసి, నియమించడమనేది ప్రభుత్వ ఏకైక విశేషాధికారంగా వుండకుండా చూడాల్సి వుంది. కమిషనర్లను ఎంపిక చేయడానికి విస్తృత కమిటీ లేదా కొలీజియాన్ని ఏర్పాటు చేయాల్సి వుంది. ఈ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులే కాకుండా, న్యాయ వ్యవస్థ ప్రముఖులు, ప్రతిపక్ష నేతలు, న్యాయ నిపుణులు వుండాలి. కమిషనర్‌గా వుండేందుకు అర్హత కేవలం సివిల్‌ సర్వెంట్లకే పరిమితం కారాదు. ప్రముఖ న్యాయ నిపుణులు, విశిష్ట ప్రతిభావంతులు, ఇతర రంగాలకు చెందిన నిష్ణాతులు కూడా వుండవచ్చు. కమిషన్‌ సమగ్రతను పరిరక్షించేందుకు సిఇసిగా లేదా కమిషనర్లుగా పదవీ విరమణ చేసినవారు మరే ఇతర ప్రభుత్వ ప్రాయోజిత పదవులను ఆమోదించకుండా నిషేధం విధించాలి. ధన బలాన్ని, పార్టీ ఫిరాయింపులను అణచివేసేందుకు, ఎన్నికల వ్యవస్థ మరింత జవాబుదారీగా చేసేందుకు అత్యవసర ప్రాతిపదికన ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సివుంది. కానీ, ఇటువంటి సంస్కరణలు ఎన్నికల కమిషన్‌ను సంస్కరించడం నుండే ప్రారంభం కావాల్సి వుంది.