May 17,2022 17:41

-విజయసాయిరెడ్డి, ఆర్‌ నిరంజన్‌రెడ్డి, బీదా మస్తాన్‌రావు, ఆర్‌ కృష్ణయ్య
అభ్యర్ధులను ప్రకటించిన సజ్జల, బొత్స

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వైసిపి నాలుగు రాజ్యసభ అభ్యర్ధులను మంగళవారం ప్రకటించింది.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్ధులను ప్రకటించారు. ఎంపిక చేసిన అభ్యర్ధుల్లో రాజ్యసభ ఎంపిగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని తిరిగి రెండోసారి అభ్యర్ధిగా ప్రకటించారు. బిసి వర్గానికి చెందిన ఆర్‌.కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావు, సుప్రీంకోర్టులో న్యాయవాధి ఎస్‌,నిరంజన్‌రెడ్డిలను అభ్యర్ధులుగా ప్రకటించారు. వీరిలో ఇద్దరు రాష్ట్రానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కావడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ బిసిలకు సముచిత స్దానం కల్పిస్తూ. ఇప్పటికే పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణలకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించారు. బిసిలకు చెందిన ఆర్‌ కృష్ణయ్య జాతీయ రాజకీయ నాయకునిగా ఉన్నారని, ఆయన విషయంలో ఆంధ్ర, తెలంగాణ అనే ప్రస్తావన రాదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బిసిలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌బోన్‌క్లాస్‌ అని నమిమన సిఎం ఆచరణలో చేసి చూపించారన్నారు. బిసిల సమస్యలపై జీవితమంతా ఆర్‌ కృష్ణయ్య పోరాటం చేశారన్నారు. బిసిలకు టిడిపి చేసిందేమీ లేదని, కేవలం ప్రచారానికి పరిమితమైప టిడిపి ఇస్త్రీపెట్టెలు, పనికిరాని పనిముట్లు ఇచ్చి ఊరుకుంటుందని విమర్శించారు.
బిసిలకోసంపోరాడుతున్నా: ఆర్‌.కృష్ణయ్య
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశ వ్యాప్తంగా బిసిల అభివృద్ది కోసం పనిచేస్తున్నానని ఆర్‌ కృష్ణయ్య పేర్కొన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలంటే అది ఒక్క తెలంగాణకే కాదు. దేశంలో అందరి కోసం రిజర్వేషన్లు కావాలని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ పెట్టాలని కొట్లాడుతున్నట్లు తెలిపారు. దేశంలోని బిసి, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కోసం రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాడుతున్నామన్నారు. అభ్యర్ధుల ప్రకటన అనంతరం సిఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
నమ్మకాన్ని నిలబెడతా: విజయసాయిరెడ్డి
రెండోసారి తనపై నమ్మకం ఉంచి ౖ అంచంచల విశ్వాసంతో సిఎం జగన్‌ రాజ్యసభకు పంపుతున్నారని, తనపై ఉంచిన నమ్మకానికి జగన్‌, భారతి గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ అనేది రాష్ట్రాల సభ అని, రాష్ట్ర సమస్యలను పార్టీ పరంగానూ, సిఎం మనసులోకి ఆకాంక్షలకు అనుగుణంగానూ నడుచుకుంటూ ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.