
ప్రజాశక్తి-వేటపాలెం: రామాపురంలో ఘర్షణకు కారకులను పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. ఇరు వర్గాలూ తమలో తాము కొట్టుకోవడంతో పాటు పోలీసులపై కూడా దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసింది. గాయపడిన పోలీసులు వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అనంతరం నిందితుల కోసం గ్రామంలో రాత్రంతా జల్లెడపట్టారు. ఈ సందర్భంగా సముద్రతీర ప్రాంత గ్రామాలతో పాటు అనుమానాస్పద ప్రాంతాలను ఒకటి వదలకుండా పోలీసులు తీవ్రంగా గాలించారు. రేపల్లె సబ్ డివిజన్ పోలీసులు 50 మంది ఒక్కసారిగా రామాపురానికి చేరుకున్నారు. వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరిన విషయం పాఠకులకు విదితమే. రామాపురంలోని ఇరువర్గాల ఘర్షణలో గాయపడిన చీరాల రూరల్ సిఐ ఏ మల్లికార్జునరావు ప్రాథమిక చికిత్స అనంతరం నిందితులను గుర్తించేందుకు రాత్రంతా తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల గాలింపు చర్యలను పసిగట్టిన కొంతమంది గ్రామస్తులు భయంతో ఇళ్లకు తాళాలు వేసుకొని పారిపోయారు. దాదాపు 60 మందికి పైగానే గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వాసనీయవర్గాల సమాచారం. ఈ ఘర్షణలో తీవ్ర గాయాల పాలైన 15 మంది గ్రామస్తులను చీరాల వైసిపి ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌బాబు, డిఎస్పి ఎస్ ప్రసాదరావులు బాధితులను పరామర్శించారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల దాకా ఈ ఘర్షణలు కొనసాగుతాయా? పోలీసులు ఇకనైనా కట్టడి చేయండి. సముద్ర తీర ప్రాంతాలకు వెళితేనే సహజంగా మనసు ఉల్లాసంగా ఉంటుంది అందుకే తీరప్రాంత గ్రామాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చెందేందుకు ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడి వాతావరణాన్ని ఇష్టపడి సేదతీరేందుకు కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, సైతం సేద తీరేందుకు వస్తూ ఉంటారు. అంతటి ప్రత్యేకత ఉన్న ఈ గ్రామాలలోకి 2019 అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పార్టీల ప్రత్యర్థులు గ్రామాలలోని ఓట్లను బహిరంగ ఆయా గ్రామాల పెద్దలతో చర్చలు నడిపారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఓట్లు పడని గ్రామాలపై రాజకీయ క్రీడ మొదలుపెట్టారు. అందులో భాగంగానే మొదలైన రామాపురం, కటారిపాలెం గ్రామాలలోని వివాదాలు మరో 11 నెలల్లో 2024 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నప్పటికీ ఈ ఘర్షణలు చల్లారలేదు తరచూ గ్రామాలలో నెత్తురు మరకలు అంటుతూనే ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించాల్సిన పోలీసుల సాచివేత ధోరణి వలనే ఆయా గ్రామాలలో గొడవలకు కారణం అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు కలగజేసుకొని రెండు గ్రామాలలో ఉన్న ఘర్షణ వాతావరణం రామాపురంలో ఉన్న వర్గ విభేదాలను రూపుమాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.