
మెహ్రీన్.. తెలుగులో యువ కథానాయికల్లో ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో అందరినీ అలరిస్తున్నారు. నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అంతేకాకుండా మెహ్రీన్ మంచి నటి అని పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని, మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేశారు. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని భాగానే అలరించింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2' మూవీతో మరో హిట్ అందుకుంది. త్వరలో 'ఎఫ్3' మూవీతోనూ పలకరించనున్నారు. ఈ సినిమాలో మెహ్రీన్ వరుణ్ తేజ్ సరసన మెరవనున్నారు. మెహ్రీన్ గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..!

పేరు : మెహ్రీన్ కౌర్
ప్రొఫెషన్ : నటి, మోడల్
పూర్తిపేరు : మెహ్రీన్ కౌర్ పిర్జాదా
పుట్టిన తేదీ : నవంబర్ 5, 1995
పుట్టిన ప్రదేశం : భటిండా, పంజాబ్
నివాస ప్రాంతం : ముంబై, మహరాష్ట్ర
చదువు : గ్రాడ్యుయేట్
హాబీస్ : ట్రావెలింగ్, డాన్సింగ్, రీడింగ్
తల్లిదండ్రులు : గుర్లాల్ పిర్జాదా, పరమ్‌జిత్ కౌర్ పిర్జాదా
సోదరుడు : గుర్ఫాత్ సింగ్ పిర్జాదా
మెహ్రీన్ పిర్జాదా పూర్తిపేరు మెహ్రీన్ కౌర్ పిర్జాదా, ప్రముఖ భారతీయ నటి, మోడల్. పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో జన్మించారు. ఈమె తమ్ముడు కూడా మోడల్, నటుడు. అంతేకాదు చిన్నప్పుడే మోడలింగ్‌లో అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత నటిగా మారారు. మెహ్రీన్ కౌర్ తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ సినిమాల్లోనూ నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లలోనే దాదాపు 18 సినిమాలు చేశారు. అనంతరం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీలోనూ నటించారు. 2017లో ఫిల్లౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. నొటా, జవాన్, మహానుభావుడు, కేరాఫ్ సూర్యా వంటి తెలుగు చిత్రాల్లోనూ నటించారు.
ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫోటోలను పంచుకుంటూ అభిమానులకు చేరువవుతుంటారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్లు బిజీగా ఉన్నారు. తాజాగా మంచిరోజులు వచ్చాయి సినిమాతో పలకరించారు.
వరుస సినిమాలతో..
కథా నాయకుడు నాగార్జున.. దర్శకుడు ప్రవీణ్ సత్తారు కలయికలో రూపొందుతోన్న చిత్రం 'ది ఘోస్ట్'. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో నాగ్‌కు జోడీగా తొలుత కాజల్‌ను ఎంపిక చేశారు. కానీ, అనుకోని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకొంది. దీంతో ఆమె స్థానంలో అమలాపాల్‌ను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆ ఛాన్స్ యువ కథానాయిక మెహ్రీన్‌ను వరించినట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర బృందం ఆమెతో కథా చర్చలు పూర్తి చేసిందని, స్క్రిప్ట్ నచ్చడంతో నాగ్ సరసన నటించేందుకు అంగీకరించినట్లు ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున మాజీ రా అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
పర్యావరణ పరిరక్షణకు..
ఈ మధ్య కాలంలో పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నడిచింది. కొందరు సెలబ్రిటీలు దీన్ని ఛాలెంజ్‌గా స్వీకరించి, పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఇందులో భాగంగా రామానాయుడు స్టూడియోలో హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా మొక్కలు నాటారు. ఆ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమన్నారు. రానున్న తరాలకు మంచి ఆక్సిజన్ అందించాలన్న సత్సంకల్పంతో చేపట్టిన గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియా కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి అని మెహ్రీన్ పిర్జదా పిలుపునిచ్చారు.
శానిటైజేషన్‌పై శ్రద్ధ అవసరం..
ఈ నటికి శుభ్రత విషయంలోనూ కొంచెం శ్రద్ధ ఎక్కువే. ఆ మధ్య ఈమె నటించిన 'మహానుభావుడు' సినిమాలో హీరో శర్వానంద్‌కు ఓసీడీ ఉంటుంది. అయితే తనకు రియల్ లైఫ్‌లో అంతకన్నా ఎక్కువ ఓసీడీ ఉందని మెహ్రీన్ చెబుతారు. 'మీరంతా కరోనా వచ్చిన తర్వాత శానిటైజర్లు వాడుతున్నారు. కానీ నాకు చాలా ఏళ్లుగా శానిటైజర్లు వాడే అలవాటు ఉంది. అప్పట్లో నా బ్యాగ్‌లో 2-3 శానిటైజర్ బాటిళ్లు ఉండేవి. ఇప్పుడు 6-7 బాటిళ్లు ఉంటు న్నాయి. నా మేకప్ స్టాఫ్ అయితే చేతులు కడుక్కొని, శానిటైజర్ రాసుకున్న తర్వాతే నా ఫేస్ టచ్ చేయాలి. మొదటి నుంచి నాకు ఈ ఓసీడీ ఉంది' అని తెలిపారు ఈ క్యూట్ హీరోయిన్.