Feb 22,2021 08:06

అమరావతి బ్యూరో : ఇప్పటివరకూ జాతీయ రహదారులకే పరిమితమైన టోల్‌గేట్ల బాదుడు ఇక రాష్ట్ర రహదారుల్లోనూ మొదలు కానుంది. దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్ర రహదారులపై టోల్‌గేట్‌ వసూళ్లకు రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రోజువారీగా అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న డీజిల్‌, పెట్రోల్‌ ధరలు, జాతీయ రహదారులపై విపరీతంగా పెరిగిన టోల్‌చార్జీలతో రవాణా రంగం ఇప్పటికే కుదేలైంది. రాష్ట్ర రహదారులపైనా టోల్‌ చార్జీలు వసూలు చేస్తే రవాణారంగంతోపాటు ప్రజాజీవనంపైనా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం వుంది. రవాణా ఖర్చులు పెరిగిపోయి నిత్యావసర సరుకుల ధరలపైనా తీవ్రప్రభావం పడనుంది. రాష్ట్రంలో జాతీయ రహదారులపై 44 టోల్‌గేట్లు ఉన్నాయి. జాతీయ రహదారి 16తోపాటు జాతీయ రహదారి 9, జాతీయ రహదారి 7, జాతీయ రహదారి 5లతోపాటు జాతీయ రహదారులను అనుసంధానించేందుకు నిర్మించిన పలు జాతీయ రహదారుల్లో టోల్‌ఫీజులు వసూలు చేస్తున్నారు. చెన్నరు నుంచి కోల్‌కతాకు వెళ్లే 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై దాదాపు 15 టోల్‌గేట్లు ఉన్నాయి. ఈ రహదారిపై ఒక కారు వెళ్లినా రాష్ట్రంలో టోల్‌ఫీజుల కిందే దాదాపు వెయ్యి రూపాయల వరకూ చెల్లించాల్సి వస్తోంది. లారీ, బస్‌లకు అయితే రూ 3 వేలు అవుతుండగా, పెద్దలారీలు అయితే దాదాపు 5 వేలు చెల్లించాల్సి వస్తోంది. జాతీయ రహదారులపై టోల్‌ఛార్జీలను ఎత్తివేయాలని రవాణారంగంలోని సంస్థలు, సంఘాలు జాతీయస్థాయిలో ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర రహదారులపై కొత్తగా టోల్‌చార్జీలను వసూలు చేయాలని రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర రహదారులకు టోల్‌చార్జీలను వసూలు చేసేందుకు 2008లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపిఆర్‌డిసి)ని ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్‌కు కొన్ని ఆర్‌అండ్‌బి రోడ్లను బదలాయించి ఎపిఆర్‌డిసి కింద నిర్మించిన రోడ్లన్నింటికీ టోల్‌ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2009 ఫిబ్రవరి 21న అప్పటి రవాణాశాఖ కార్యదర్శి టి చటర్జీ జిఓలను ఇచ్చారు. అయినప్పటికీ, ఆ తరువాత అమలు కాలేదు. ఆ ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో టోల్‌చార్జీలను వసూలు చేసేందుకు ప్రభుత్వం తాజాగా రంగం సిద్ధం చేసింది. రహదారులతో పాటు రూ.25 కోట్లు అంతకుమించిన అంచనాలతో నిర్మించిన బ్రిడ్జిలు, అండర్‌పాస్‌, అండర్‌గ్రౌండ్‌ రోడ్లకు టోల్‌ ఛార్జీలను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర రహదారుల్లో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లు, టోల్‌గేట్‌కు ఐదు కిలోమీటర్‌ పరిధిలో ఉండే గ్రామాలకు మినహాయింపులు ఇచ్చి మిగిలిన వాహనాలన్నింటికీ టోల్‌చార్జీలు వసూలు చేయనున్నారు. ఒక కిలోమీటర్‌కు కార్‌లకు అయితే 90 పైసలు, మిని ట్రక్‌లకు రూ.1.80, బస్‌, లారీలకు రూ.3.55, హెవీ వాహనాలు అయితే రూ.8.90గా వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రోడ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలుపడి టోల్‌ఛార్జీలను వసూలు చేస్తే తమ పరిస్థితి ఏంటని వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.