Jan 31,2023 21:08

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి తెలిపారు. ఐద్వా పట్టణ జనరల్‌ బాడీ సమావేశం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మద్యం ఏరులై పారుతోందని, మద్యం తాగి పురుషులు అనారోగ్యాలు పాలై మరణిస్తే ఆ కుటుంబ భారమంతా మహిళపైనే పడుతోందన్నారు. ఒంటరి మహిళలుగా కుటుంబాలను సాగలేక నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. మద్యాన్ని పూర్తిగా నియంత్రించకపోయినా మండలానికి ఒక షాపు పెట్టి నియంత్రించాలన్నారు. అలాగే ఉపాధి హామీ పనులు 100 రోజులు చూపించకుండా, ధరలు నియంత్రించకుండా ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని విమర్వించారు. మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వాలు ఆవిధంగా చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేరళ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించి 14 రకాల నిత్యావసర వస్తువులు అందిస్తోందని, మన ప్రభుత్వం ఎన్నికల జిమ్మిక్కులు చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కోటి సభ్యత్వంతో ఉన్న ఐద్వా సంఘం నిరంతర మహిళల సమస్యలపై పనిచేస్తోందని, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తోందని తెలిపారు. ఈ పోరాటాలకు మహిళలందరూ ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడుతూ 2023 సంవత్సరం సభ్యత్వాలు చేయించాలని, వార్డుల్లో వార్డు కమిటీలు వేసి వార్డు సమస్యలపై పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షురాలు పూర్ణిమ, కార్యదర్శి యశోద పద్మ, పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.