May 28,2023 22:40

ఒరిగిన లారీ, నిలిచిన గూడ్స్‌ రైలు

- నిలిచిన గూడ్స్‌ రైలు
టెక్కలి:
మండలంలోని సీతాపురానికి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆదివారం మధ్యాహ్నం గ్రానైట్‌ లోడు రాయితో వెళ్తున్న లారీ ఒరిగిపోయింది. ప్రమాదం జరిగిన కొద్ది సమయానికే నౌపడా నుంచి గుణుపూర్‌ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు రావడంతో గ్రామస్తులు అప్రమత్తమై నిలుపుదల చేయించారు. టెక్కలి నుంచి లింగాలవలస వైపు గ్రానైట్‌ రాయి లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. అయితే సదరు లారీ రైల్వే ట్రాక్‌ పక్కనున్న రైలింగ్‌ దాటి పట్టాలపైకి ఒరిగిపోవ డంతో పెద్ద ప్రమాదమే సంభవించిందని భావించి పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు తరలివచ్చారు. అనంతరం గ్రామస్తులు రైల్వే అధికారులు సమాచారం అందజేశారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్‌ సహాయంలో లారీని పక్కకి తప్పించారు. అనంతరం యథావిథిగా గూడ్స్‌ను కదిలించారు. ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.