Mar 27,2023 21:52

నిరసన తెలుపుతున్న ఐఎంఎ, ప్రైవేటు నర్సింగ్‌హోమ్స్‌ అసోసియేషన్‌ నాయకులు

ప్రజాశక్తి- విజయనగరం కోట : రైట్‌ టు హెల్త్‌బిల్‌ వైద్య రంగానికి, ప్రజలకు హాని కలిగిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ అండ్‌ నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ జెసి నాయుడు, కార్యదర్శి సి.సురేష్‌ బాబు, ఐఎంఎ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ ఎ.మధుకర్‌, కార్యదర్శి డాక్టర్‌ బి.మహేంద్రగిరి అన్నారు. సోమవారం ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు ఆరోగ్య హక్కు కల్పన పేరుతో డాక్టర్ల స్వేచ్ఛను హరించే చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న డాక్టర్లపై రాజస్థాన్‌ ప్రభుత్వం లాఠీలు ఝుళిపించడాన్ని ఖండించారు. ప్రైవేట్‌ డాక్టర్లు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వాలు వైద్యరంగ విషయంలో డాక్టర్ల విషయంలో ఏదైనా బిల్లు ప్రవేశ పెట్టాలంటే వైద్యుల సలహాలు తీసుకోవాలని కోరారు ఏ ప్రభుత్వాలైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరాదన్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ బిల్లు ప్రకారం ఏదైనా ఒక ఎమర్జెన్సీ కేసును తీసుకోవాల్సి వస్తే అన్ని రోగాలకు ఒకే రకమైన డాక్టర్‌ వైద్యం చేయలేడు కాబట్టి ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఈ సందర్భంలోనే బాధితులు దాడులు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ బిల్లు డాక్టర్ల మనోభావాలు దెబ్బతినేలా ఉందన్నారు. ఈ సందర్భంగా నిరసన తెలిపారు.