May 18,2022 00:00

బహిరంగ సభలో మాట్లాడుతున్న జమలయ్య

- ఆత్మహత్యల నివారణకు రైతాంగ ఉపశమన చట్టం తేవాలి
- సాగు, తాగునీటి కోసం పోరాడాలి
- రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జమలయ్య
- భారీ ర్యాలీతో అట్టహాసంగా ప్రారంభమైన రైతు సంఘం జిల్లా మహాసభ
ప్రజాశక్తి-పత్తికొండ/దేవనకొండ:
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నిత్యం కరువుకాటకాలతో అల్లాడుతోందని, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులు మరో పోరాటానికి సిద్ధం కావాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జమలయ్య పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా 12వ మహాసభ పత్తికొండలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ నుంచి రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, నాయకులు, కార్యకర్తలు ప్రధాన వీధుల గుండా ర్యాలీగా అంబేద్కర్‌ సర్కిల్‌ దగ్గరకు వచ్చి అక్కడ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. జమలయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం పట్ల అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో వైసిపి అధికారం చేపట్టినప్పటి నుంచి మూడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, నరేంద్ర మోడీ పాలనలో భారతదేశంలో లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. రైతు రాజ్యం, రైతు ప్రభుత్వాలని కల్లబొల్లి మాటలు చెప్పి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కనిపించకపోవడంతో రైతుల ఆదాయం పూర్తిగా దిగజారి పోయిందన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేరళ ప్రభుత్వం తరహాలో రైతాంగ ఉపశమన చట్టం తీసుకువచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ బి కే కేంద్రాలు రైతులకు ఏ మాత్రం ఉపయోగపడడం లేదని, బహుళ జాతి కంపెనీల కు ఎరువులు విత్తనాలు విక్రయాలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.1800 కోట్ల పరిహారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ రైతుల పంపుసెట్లకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించే ప్రయత్నంలో ఉందని దాని నివారణకు రైతులు మరో ఉద్యమాలకు సిద్ధంగా కావాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వీర శేఖర్‌, రైతు సంఘం మండల కార్యదర్శి సిద్దా గౌడ్‌, వ్యకాస దస్తగిరి, సిఐటియు మండల కార్యదర్శి గోపాల్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు మధు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పత్తికొండలో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన 12వ జిల్లా మహాసభ ప్రారంభం సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి. రైతాంగ, కార్మిక, కర్షకులు పోరాటాల ద్వారా సాధించకున్న హక్కుల పట్ల నృత్యం, గేయ కార్యక్రమాలు ప్రజలను ఆకర్షితులను చేశాయి. ప్రజా నాట్యమండలి జిల్లా నాయకులు బతకన్న, సుంకన్న, సుబ్బరాయుడు, కళాకారులు పాల్గొన్నారు.

పత్తికొండలో ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు, కార్యకర్తలు
పత్తికొండలో ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు, కార్యకర్తలు