Apr 20,2021 22:37
  • 'సున్నా వడ్డీ' రాయితీ విడుదల
  • ఒకేసారి రూ.128.47 కోట్లు ఖాతాల్లోకి
  • 6.27 లక్షల మందికి లబ్ధి

ప్రజాశక్తిఅమరావతి బ్యూరో : రైతు బాగుంటే వ్యవసాయ కార్మికులు బాగుంటారనీ, వారు బాగుంటే రాష్ట్రం బాగుటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ రుణాల పథకానికి సంబంధించిన రాయితీ నిధులను విడుదల చేసే కార్యక్రమం మంగళవారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 6,27,906 మంది రైతుల ఖాతాల్లోకి రూ.128.47 కోట్ల రాయితీ మొత్తాన్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి సిఎం జమ చేశారు. రూ.లక్ష వరకు పంట రుణం తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించిన రైతులకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్జేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులు, వ్యవసాయ కార్మికులు బాగుంటే రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన దాదాపు 62 శాతం జనాభా మంచిగా బతికే అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు. 2019 జూన్‌ నుండి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద 61.22 లక్షల మంది రైతులకు రూ.1,132.54 కోట్లు విడుదల చేశామన్నారు. మొత్తంగా ఇప్పటి వరకు సున్నా వడ్డీ పంట రుణాలకు రూ.1,300 కోట్లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇవ్వడం వల్ల యేటా ఒక్కో రైతుకు రూ.46 వేలు ఆదా అవుతోందన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 10,601 రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బికె) ఏర్పాటు చేశామని తెలిపారు. వైఎస్‌ఆర్‌ ఉచిత పంట బీమా, విపత్తు సమయంలో ఆదుకునేందుకు సహాయనిధి, ధరల స్థిరీకరణ నిధి తదితర పథకాల కింద రైతులకు అందజేసిన ప్రయోజనాలను ఆయన గుర్తు చేశారు.

జూన్‌ నుంచి ఇాక్రాప్‌
ధాన్యం కొనుగోలు కోసం రూ.18,344 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. ఈ ఏడాది జూన్‌ నుండి ఇ-క్రాప్‌ బుకింగ్‌ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కె.కన్నబాబు, అధికారులు పూనం.మాలకొండయ్య, హెచ్‌.అరుణ్‌కుమార్‌, వై.మధుసూధన్‌రెడ్డి, వి.బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు అంబటి.కృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గన్నారు.