Dec 21,2020 07:50

నా చిన్నపవిడు నాన్న
కొల్లేటి వ్యవసాయం చేసేవాడు
ఎడ్ల బళ్ళెక్కి నేనూ వెళ్ళేవాడిని
ఊడ్పులు.. కలుపు తీతలూ
కోతలూ కుప్పనూర్పులూ వలస పిట్టలూ
నా బాల్యానికి అంటుకున్న దృశ్యాలు-
ఇప్పుడు కలలేవో
మనసుకు చెమటలా పడుతున్నాయి
నా ముసలి నాన్న రాజధాని సరిహద్దులో
చలిలో వణికిపోతూ కూర్చున్నట్టు

మా చిన్నాన్న మైసూరు నుంచి
ఎడ్లు తెచ్చి వాటికి తళుకుటద్దాలు కుట్టిన
రంగు బట్టలు కట్టి బండిని అలంకరించి
పొలాల గట్లమ్మట పరుగులు తీయించే వాడు
అప్పుడు నేనూ మా ఊరూ
ఆ బండిలోనే కూర్చుని ఊరేగేవాళ్ళం
దారి పొడవునా రైతుల నవ్వులు
ఆ అద్దాలకు మరిన్ని రంగులద్దేవి
ఇప్పుడేవో ఊహలు-
మా ఎడ్లు రాజధాని వైపు పరుగులు దీస్తున్నట్టు ..


మా నాన్నమ్మ మహా స్వాభిమాని
గోడ్ల చావిడి దగ్గరే గది కట్టించుకుని
పుల్లట్లూ ఇడ్లీలూ అమ్మేది
తెల్లారగట్ట రైతులు మా ఇంటి మీదుగానే
కొల్లేరు వెళుతూ అవి తినేవారు
నాకిప్పుడు ఢిల్లీ సరిహద్దుల నుంచి
అదే వాసన వస్తోంది

అమ్మ పుస్తెల తాడు
మెడలో కంటే కోమటి గంగయ్య గారి
ఇనప్పెట్టెలోనే బహు భద్రంగా ఉండేది
కొల్లేటి పంట వరద నీట
పడవలా తేలి పారిపోయినప్పుడు
నాన్న కన్నీటి బొట్లతో తాడు ఎంత పేనినా
అమ్మ మెడలో అది అమిరేదే కాదు
టీవీలో రైతులంతా అమ్మానాన్నలానే కనిపిస్తున్నారు

పోలీసుల కన్నా
బ్యాంకోళ్ళంటేనే భయపడేవాళ్ళం
లోన్లు కట్టలేదని ఇంట్లో సామానంతా
రోడ్డు మీద విసిరేసే వారు
ఇప్పుడు రైతుల్నే రోడ్ల మీద పారేశారు

కొల్లేటిలో వ్యవసాయం చేసి
కొంప కొల్లేరు చేసుకున్నాడు నాన్న
ఏమీ మార లేదు
దేశమంతా రైతు బతుకింతే !

రైతు హక్కుల మాటెత్తితే
టెర్రరిస్టువంటున్నారు
నువ్వు టెర్రరిస్టువా అంటే
మరి నాన్న ఏమంటాడో చూడాలి

రైతుల నిరాహార దీక్ష
నాకేమీ ఆకలిగా లేదు
ఏలికలకు మాత్రం
తిన్నదెలా అరుగుతుందో..?

చలిలో రైతు గడ్డకట్టిపోతున్నాడు
ఎన్ని రగ్గులు కప్పుకున్నా
నాకేం చలి తగ్గడం లేదు
రైతు బిడ్డా అని ఎవరో పిలుస్తున్నట్టే వుంది !


- ప్రసాదమూర్తి