Feb 05,2021 19:18

చెన్నై : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తమిళనాడులోని అన్నాడిఎంకె ప్రభుత్వం పలు తాయిలాలను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా సహకార బ్యాంకులో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పడి కె.పళనిస్వామి శుక్రవారం ప్రకటించారు. ఇందుకుగానూ రూ.12,110 కోట్లను కేటాయించనున్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. దీని ద్వారా సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న దాదాపు 16.43 లక్షల మంది రైతులకు రుణమాఫీ ప్రయోజనం దక్కతుందని ఆయన పళనిస్వామి పేర్కొన్నారు. ఈ పథకం వెంటనే అమలులోకి వస్తుందని వెల్లడించారు. దీనికి అవసరమైన నిధులను తమ ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుందని ఆయన తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తమ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుందని, అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి పలు రైతు సంఘాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. రుణమాఫీపై 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష డిఎంకె ఇచ్చిన రుణమాఫీ హామీపై ఆయన పళనిస్వామి మాట్లాడుతూ పలు విమర్శలు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో 38 స్థానాలు గెలిచిన డిఎంకె ఆ తరువాత ఆ హామీని మర్చిపోయిందని అన్నారు. ప్రతి ఎన్నికల్లో ఇటువంటి హామీలు ఇవ్వడం వారికి పరిపాటిగా మారిందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నాడిఎంకె ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు. 2016, 2017లలో కూడా తమ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్పారు. రైతు రుణమాఫీనే కాకుండా మరిన్ని నూతన సంక్షేమ పథకాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.