
ప్రజాశక్తి-గజపతినగరం : భూ కబ్జాలు, ఇసుక దందాలు పక్కనపెట్టి రైతు సమస్యలను పట్టించుకోవాలని మాజీ ఎమ్మెల్యే కె.ఎ నాయుడు.. స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యకు హితవుపలికారు. గజపతినగరంలో సోమవారం టిడిపి ఆధ్వర్యాన ధాన్యం బస్తాలతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజపతినగరం, బొండపల్లి మండలాల్లో సుమారు 37 వేల టన్నులకు పైగా ధాన్యం పండిస్తే, 23 వేల టన్నులను మాత్రమే రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయడం దారుణమన్నారు. మిగతా ధాన్యాన్ని ఎవరు కొంటారని ప్రశ్నించారు. రైతులు శ్రమపడి పండించిన ధాన్యం దళారుల పాలవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. అది కూడా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతుందని ఆగ్రహించారు. అనేక సభల్లోని, ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ప్రతి గింజా కొంటామని ఊదరగొట్టిన మాటలు ఏమయ్యాయని నిలదీశారు. ధాన్యం సేకరణలో అధికారులతో తప్పుడు లెక్కలు చెప్పించడం వైసిపి నాయకులకే చెల్లిందని ఎద్దేవాచేశారు. రైతులపై కనీస బాధ్యత లేని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అధికారంలో ఉండే అర్హత కోల్పోయారని చెప్పారు. అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు వినూత్నరీతిలో ధాన్యం బస్తాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు బండారు బాలాజీ, టిడిపి మండల అధ్యక్షులు అట్టాడ లక్ష్మునాయుడు, నాయకులు పి.వి.వి.గోపాలరాజు, వై.మైథిలి ప్రియాంక, వేమలి చైతన్య తదితరులు పాల్గొన్నారు.