
ప్రజాశక్తి-యంత్రాంగం
పద్మనాభం : విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం, పద్మనాభం మండలం, పాండ్రంగి గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ప్రజా ప్రతినిధులతో కలిసి రైతుభరోసా, పిఎం.కిసాన్ పంపిణీని గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో ముందుగా మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఐదో ఏడాది మొదటి విడతగా వైఎస్‌ఆర్ రైతు భరోసా -పిఎం కిసాన్ నిధులు విశాఖ జిల్లాలో 27,955 మంది రైతు కుటుంబాలకు మొత్తం రూ.20.97 కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు. మార్చి -ఏప్రిల్ 2023 అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కింద 125 మంది రైతులకు రూ.3.26 లక్షలు రాయితీ విడుదల చేసినట్లు చెప్పారు. ఇంకా ఎవరికైనా రైతు భరోసా నిధులు అందకపోతే స్థానిక గ్రామ సచివాలయంలో సంప్రదించాలని సూచించారు. పాండ్రంగిలో పెండింగ్‌లో ఉన్న వంతెన కోసం త్వరలోనే టెండర్ పనులు చేపడతామన్నారు. అల్లూరి సీతారామరాజు మ్యూజియం పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే మొత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రైతులకు చెప్పిన సమయానికంటే ముందుగానే ఖాతాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి డబ్బు జమ చేస్తున్నారని తెలిపారు. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా బటన్ నొక్కి నేరుగా నిధులను లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం అనంతరం జిల్లాలో లబ్ధిపొందిన 27955 మంది రైతులకు రూ.20.97 కోట్ల రూపాయల మెగా చెక్కును ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ మల్లికార్జున రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఆర్‌డిఒ భాస్కర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అప్పలస్వామి, పాండ్రంగి సర్పంచ్ ఝాన్సీ, ఎంపిపి రాంబాబు, మండల వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
అనంతరం మండలంలోని పలు సమస్యలను ఎంపిపి రాంబాబు, పాండ్రంగి పంచాయతీలోని సమస్యలను సర్పంచ్ ఝాన్సీ జిల్లా కలెక్టర్ మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు.
అనకాపల్లి : పట్టణంలోని గుండాల జంక్షన్ సచివాలయాల సమావేశ మందిరంలో గురువారం జిల్లా రైతు భరోసా, పిఎం కిసాన్ పెట్టుబడి సాయం విడుదల కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి వి సత్యవతి, జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి పాల్గొన్నారు. జిల్లాలో వరుసగా ఐదవ ఏట, మొదటి విడతగా 2,59,549 మంది రైతులకు రూ.194.66 కోట్ల రైతుభరోసా నిధులతో పాటు, ఏప్రిల్ మే మాసాలలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన 698 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.12.89లక్షలను విడుదల చేసినట్లు కలెక్టర్ రవిసుభాష్ వెల్లడిచారు. ఈసందర్భంగా కర్నూల్ జిల్లా పత్తికొండలో సిఎం జగన్మోహనరెడ్డి రైతుభరోసా పంపిణీ ప్రత్యక్షప్రసారం తిలకించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పలకా యశోద రవి, వ్యవసాయ శాఖ జెడి మోహన్ రావు, హార్టికల్చర్ డిడి ప్రభాకరరావు, ఎంపిపి పెంటకోట జ్యోతి, పెంటకోట శ్రీనివాస్ పాల్గొన్నారు.