Oct 18,2020 23:05

చెట్లను తొలగిస్తున్న ప్రొక్లెయినర్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం సిటీ : దశాబ్దాల కాలంగా తాము సాగుతున్న భూముల్లో ఆక్రమణదారులు ఆక్రమణలకు పాల్పడడం తగదని చిలకపాలెంనకు చెందిన రైతులు తోనంగినందోడు, కైలాష్‌ తెలిపారు. ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురం కొండలపై జీడిమామిడి, టేకు, మామిడి వంటి పంటలను సాగు చేసుకుంటూ చిలకపాలెంకు చెందిన రైతులు దశాబ్దాలుగా జీవిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం చిలకపాలెంకు చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తమ భూముల్లో పంటలను ప్రొక్లెయినర్‌ సహాయంతో పంటలు ధ్వంసం చేసి ఆక్రమణలకు పాల్పడుతున్నట్టు సమాచారం రావడంతో తాము అక్కడికి చేరుకున్నామన్నారు. ఈ భూములు తమకు చెందినవి చెబుతున్నప్పటికీ ప్రొక్లెయినర్‌ డ్రైవర్‌ వినకుండా పంటలను నాశనం చేయడంతో అతనిని అడ్డగించామన్నారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎస్‌ఐ రాజేష్‌ గ్రామానికి చేరుకొని ఈ భూములను ఓ వ్యాపారి కొనుగోలు చేశారని, మీకు ఈ భూములపై హక్కు లేదని తెలిపారని వాపోయారు. అలాగే 160 మందిపై ఫిర్యాదు అందిందని, వారిపై కేసు నమోదు చేస్తామని సోమవారం స్థానిక తహశీల్దా ర్‌ కార్యాలయానికి రావాలని బెదిరిస్తున్నట్టు రైతులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు రైతులతో మాట్లాడారు. రైతుల భూముల్లోని పంటలను నాశనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని మోహనరావు డిమాండ్‌ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ భూములను నమ్ముకొని రైతులు జీవనం సాగిస్తున్నారని, వారికి ఉపాధి లేకుండా చేయడం తగదని అన్నారు.