Oct 03,2022 22:19

రైతు సంఘాల సమన్వయ కమిటీ కమిటీ ఆధ్వర్యాన బ్లాక్‌ డే
ప్రధాని మోడీ రైతాంగ వ్యతిరేక విధానాలపై నిరసన
మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తేవాలి
అఖిలపక్ష రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ నాయకుల డిమాండ్‌
ప్రజాశక్తి - ఏలూరు

                   బిజెపి ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరీలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు, బిజెపి గూండాలు సాగించిన మారణకాండను ఖండిస్తూ బ్లాక్‌ డేగా పాటిస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం అఖిలపక్ష రైతు సంఘాల ఏలూరు జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, బికెఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్‌రావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.సోమయ్య, ఎఐటియుసి జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు మాట్లాడారు. కేంద్రప్రభుత్వం రైతాంగ ఉద్యమం సందర్భంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన హమీలను అమలు చేయకుండా రైతాంగాన్ని మోసగించిందని, దగా చేసిందని తీవ్రంగా విమర్శించారు. మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకు వస్తామని చెప్పి కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణ విమోచన చట్టాన్ని తెచ్చి రైతాంగాన్ని ఆత్మహత్యల నుండి రక్షిస్తామని వట్టి మాటలు చెప్పారన్నారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లులో వ్యవసాయరంగాన్ని మినహాయిస్తామని హామీ ఇచ్చి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేలా కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు. రైతు ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను రద్దు చేస్తామని, లఖింపూర్‌ ఖేరి ఘటనలో రైతులను చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఇంతవరకు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం అన్యాయమన్నారు. ఏ ఒక్క హామీ అమలుపర్చకుండా మరోవైపు దొడ్డిదారిన రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను తిరిగి పునరుద్ధరించే పద్ధతుల్లో, కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేసే విధంగా అనేక ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం చేస్తోందన్నారు. అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్‌లోని ఆపిల్‌ పంటలు ఆదానీకి కట్టబెట్టాలని కుట్రలు చేస్తూ అర్థం లేని ట్రాఫిక్‌ ఆంక్షలతో ఆపిల్‌ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లక్ష టన్నులు ఆపిల్‌ పంట నాశనమై రైతులు లబోదిబోమంటున్నారని చెప్పారు. కోల్డ్‌ స్టోరేజీలలో ఆపిల్‌ పంట దాచుకోవాలని ఆంక్షలు పెడుతున్నారని చెప్పారు. మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను కార్మిక, కర్షక ఐక్యతతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం బికెఎంయు, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌, ఐఎఫ్‌టియు, సిఐటియు, ఎఐటియుసి తదితర సంఘాల నాయకులు బద్దా వెంకట్రావు, వి.సాయిబాబా, కట్టా భాస్కర్‌రావు మిద్దే వెంకటేశ్వరరావు, లంకా రామ్మోహన్‌, కాకర్ల అప్పారావు, ఎన్‌.నెహ్రూబాబు, జగ్గపు వెంకటరమణ, కొమ్మన సాంబశివరావు, సేవాదళ్‌ సుబ్బారావు, ఉప్పు మురళీకృష్ణ, మంగం అప్పారావు, ఎ.అప్పలరాజు, గండి రాజా, బాలా భాస్కరరావు, పోలా భాస్కరరావు, వాడవల్లి రామారావు, రాయల సతీష్‌, బుగ్గల ప్రభాకర్‌రావు, బి.ఏసురత్నం, పి.బిక్షాలు, అజరు, కొండలరావు, శ్రీను, ఆదినారాయణ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.