Jul 29,2021 21:56

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరుకుమార్‌



మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరుకుమార్‌
రైతులపై బిజెపి కక్ష సాధింపు చర్యలు
సేవ్‌ ఇండియా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు
ప్రజాశక్తి-సీతారామపురం:బిజెపి ప్రభుత్వం రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరుకుమార్‌ విమర్శించారు. ఆగస్టు 9వ తేదీన క్విట్‌ ఇండియా రోజును పురస్కరించుకొని సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవ్‌ ఇండియా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని సిఐటియు, రైతు సంఘాల నాయకులతో ఆయన రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి, మతోన్మాదాన్ని తుంచండి అనే నినాదాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ గత రెండు సంవత్సరాల పాలనలో దేశం కరోనా కోరల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని ప్రయివేటు పరం చేస్తూ ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసి దేశ భవిష్యత్తుకు బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు
. ప్రజలందరూ కలిసి పోరాడి సంపాదించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తే రిజర్వేషన్ల పరిస్థితి, బడుగు బలహీన వర్గాల ప్రజల స్థితిగతులు అగమ్యగోచరంగా ఉంటాయన్నారు. ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్‌, డిఫెన్స్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ లన్నింటిని ప్రయివేటుపరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలందరూ కలిసి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతే రాజు అంటూనే మోడీ ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందన్నారు. ఢిల్లీలో గత తొమ్మిది నెలల నుంచి నల్ల చట్టాలను రద్దు చేయాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు శాంతీయుతంగా పోరాడుతుంటే బిజెపి ప్రభుత్వం రైతుల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. కేంద్రానికి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు వంతపాడడం తగదన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక బెదిరింపు ధోరణిని బిజెపి మంత్రులు అవలంభించడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు కాకు వెంకటయ్య, సిఐటియు మండల నాయకులు కోడె రమణయ్య, ఎస్‌కె షాను, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.