
ప్రజాశక్తి విలేకరులు... మడకశిర : ప్రజలతో సఖ్యతగా ఉండాల్సిన పోలీసులే విచక్షణ మరిచారు. సమస్యను పరిష్కరించమని పోలీసు స్టేషన్కు వెళ్లిన వారిపైనే దాడి చేశారు. దాడి చేయడంతో పాటు కులం పేరుతోనూ దూషించారు. ఈ ఘటన మడకశిర పోలీసు స్టేషన్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు, రైతు సంఘం నాయకుడు సోముశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మడకశిర నగర పంచాయతీ పరిధిలోని మళ్లినాయకన్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు భూమి విషయమై ఇటీవల చిన్నపాటి గొడవ చేసుకున్నారు. ఈ విషయమై సోమవారం రాత్రి 7-30 గంటల సమయంలో న్యాయం కోసం వీరిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. వీరికి సహాయంగా రైతుసంఘం మండల నాయకులు సోముశేఖర్, రామకష్ణారెడ్డిలు పోలీసు స్టేషన్కు వెళ్లారు. ఈ సందర్భంగా సమస్యను వీరిద్దరూ పోలీసులకు తెలిపే ప్రయత్నం చేశారు. అయితే సమస్యను విని పరిష్కరించాల్సిన పోలీసులు అకారణంగా వారిపై దూషణకు దిగారు. విధుల్లో ఉన్న ఎఎస్ఐ ధనుంజరు పరుష పదజాలంతో సోమశేఖర్, రామకృష్ణారెడ్డిలపై దూషణకు దిగారు. రైతులతో సఖ్యతగా మాట్లాడాలని సోమశేఖర్ సూచిస్తూ ఉండగా లోపలి నుంచి ఆగ్రహంతో వచ్చిన ఎస్ఐ శేషగిరి సోముశేఖర్ను పోలీసు స్టేషన్లోకి లాక్కెళ్లి చితకబాదాడు. కొట్టడంతో పాటు కులం పేరుతో దూషించాడు. పోలీసు దాడిలో గాయపడిన ఇద్దరు బాధితులు మంగళవారం విషయాన్ని మీడియా, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అకారణంగా కొట్టిన ఎస్ఐ, ఎఎస్ఐ చర్యలు తీసుకోవాలని వారు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
పుట్టపర్తి అర్బన్ : రైతు సంఘం నాయకుడు సోముకుమార్పైనా, రైతులపైనా అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం, రైతుసంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, రైతుసంఘం అధ్యక్షులు హరి, జిల్లా ప్రధాన కార్యదర్శి బడాసుబ్బిరెడ్డి, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, రైతుసంఘం నాయకుడిపై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. రైతుల మధ్య గొడవ జరిగి స్టేషన్కు వెళ్లిన రైతులపట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం తగదన్నారు. రైతులను దూషించడం తగదని చెప్పిన దళితుడైన సోము కుమార్ను కులం పేరుతో దూషించి కొట్టడం అమానుషమన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారన చేసి ఎస్ఐ, ఎఎస్ఐలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.