Aug 06,2022 23:30

8, 9 గేట్లు ద్వారా శారదానదిలోకి వెళ్తున్న నీరు

ప్రజాశక్తి- దేవరాపల్లి
వరద నీటితో రైవాడ జలాశయం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో శనివారం మధ్యాహ్నం 8, 9 గేట్ల ద్వారా 1200 క్యూసెక్కుల నీటిని శారదా నదిలోకి విడుదల చేశారు. జలాశయ నీటిమట్టం 114 మీటర్లు కాగా శనివారం మధ్యాహానికి 113.45 మీటర్లకు దాటింది. దీంతో అప్రమత్తమమైన రైవాడ జలాశయ ఎఇ సత్యమునాయుడు, సిబ్బంది 8, 9 రెగ్యులేటింగ్‌ గేట్లు ఎత్తి నీటిని విడదల చేశారు. దీంతో శారదా నది వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను నదిలోకి దిగవద్దని తహశీల్దారు ఎం.లక్ష్మి కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామాల్లో దండోరాలు వేయించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు 1800 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలో వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. ఎస్‌ఐ పి.సింహాచలం తమ సిబ్బందిని నదీ పరివాహక ప్రాంతాలకు పంపించి ప్రజలను అప్రమత్తం చేశారు. శారదా నదిలో శనివారం బట్టలు ఉతుకుతున్న రజకులను ఖాళీ చేయించారు. ఒకవేళ వర్షాలు అధికమై జలాశయంలో వరద నీరు మరింత పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని జలాశయ సిబ్బంది తెలిపారు.