Nov 21,2020 21:42

అమరావతి బ్యూరో: ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 23 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 8, 9 తరగతి విద్యార్థులు రోజు తప్పించి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉండగా, పదో తరగతి విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ మూడు తరగతుల విద్యార్థులకు బోధన జరుపుతూనే డిసెంబరు 14 నుంచి 6, 7 తగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. 14వ తేదీ తర్వాత అప్పటి పరిస్థితులను సమీక్షించుకుని 1 నుంచి ఐదో తరగతి వరకు తరగతులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 1:45 గంటల వరకు జరుగుతున్న పాఠశాలలు, చలికాలం వల్ల ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.