May 04,2021 08:57
  • బెంగాల్‌లో హింస

కోల్‌కతా : మూడోసారి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జగ్‌దీప్‌ ధనకర్‌ను కలిసి మమతా తన రాజీనామాను సమర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మమత మాట్లాడుతూ త్వరలోనే తాను ప్రమాణస్వీకారం చేస్తానని తెలిపారు. అంతకు ముందు సోమవారం నూతనంగా ఎన్నికైన టిఎంసి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మమతాను తమ నేతగా ఎన్నుకున్నారు. ఈ ఎమ్మెల్యేలు అంతా గురువారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది.

                                                 ఫలితాల తరువాత హింసాకాండ : బిజెపి
ఎన్నికల ఫలితాలు వెల్లడి తరువాత రాష్ట్రంలో హింసాకాండ చోటు చేసుకుంటున్నట్లు బిజెపి ఆరోపించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దిలీప్‌ ఘోష్‌ విలేకరులతో మాట్లాడుతూ గత 24 గంటల్లో రాష్ట్రంలో ఆరుగురు హత్యకు గురయ్యారని, వారిలో ఐదుగురు తమ పార్టీ మద్దతుదారులని తెలిపారు. వేలాది దుకాణాలు, నివాసాలు ధ్వంసం చేయబడ్డాయని చెప్పారు.
హింసాకాండపై గవర్నర్‌ ఆందోళన
    ఎన్నికల తరువాత జరుగుతున్న హింసా కాండపై గవర్నర్‌ జగ్‌దీప్‌ ధనకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. హింస, విధ్వంసంపై నివేదిక సమర్పించాలని అధికారులను గవర్నర్‌ ఆదేశించారు. ఈ అంశంపై రాష్ట్ర డిజిపి, కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌, అదనపు ప్రధాన కార్యదర్శి (హోంశాఖ)లకు సమన్లు జారీ చేశారు. 'బిజెపి, కేంద్ర బలగాలు దారుణమైన చర్యలకు పాల్పడ్డాయి. కానీ అందరూ శాంతి యుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని మమతా బెనర్జీ టిఎంసి కార్యకర్తలను కోరారు.