May 29,2023 21:52

నిరసన తెలుపుతున్న గిరిజనులు

ప్రజాశక్తి - కురుపాం : రేషన్‌ బియ్యం కావాలంటే గిరిజనులు 8 కిలోమీటర్లు నడవాల్సిందే అని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు ప్రభుత్వానికి ప్రశ్నించారు. గిరిజన సంఘం జిల్లా మహాసభల ప్రచారం కోసం మండలంలో నీలకంఠాపురం పంచాయితీ నాయుడుగూడకు సోమవారం ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన దృష్టికి సమస్యను గిరిజనులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నాయుడుగూడలో గిరిజనులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాయుడుగూడ నుండి ధర్మలక్ష్మీపురం మీదుగా 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న నీలకంఠపురం గ్రామానికి రేషన్‌ బియ్యం కోసం కాలి నడకన వెళ్తున్నారని, రానూపోనూ 16 కిలోమీటర్లు దూరం నడిచి గిరిజనులు బియ్యం తెచ్చుకుంటున్నారని తెలిపారు. వెళ్లిన రోజు వేలి ముద్రలు పడక పోతే రెండేసి, మూడేసి రోజులు తిరగాల్సి వస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. గతంలో జుంబిరిలో రేషన్‌ డిపో ఉండేదని దాన్ని నీలకంఠపురానికి మార్చినప్పటి నుంచి ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. జుంబిరిలో డిపోను ఉంచాలని తహశీల్దార్‌కు వినతిపత్రం అందించినప్పటికీ మార్పు చేయలేదని అన్నారు. కూలి పనులను విడిచిపెట్టి రేషన్‌ కోసం రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జుంబిరిలో డిపో అయిన ఏర్పాటు చేయాలని, లేకుంటే ఆఫ్‌లైన్లోనైనా రేషన్‌ బియ్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు బిడ్డిక వెంకటరావు, నాగేశ్వరరావు, గిరిజనులు పాల్గొన్నారు.