Oct 15,2020 19:06

పోలెండ్‌ : రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబేంటీ..? ఇప్పుడు పేలడమేంటి? అనుకుంటున్నారా..? నిజమండీ బాబూ.. రెండో ప్రపంచకాలం నాటి బాంబు పేలిన ఘటన పోలెండ్‌లో చోటు చేసుకుంది. పోలెండ్‌లోని బాల్టిక్‌ సముద్రానికి సమీపంలోని జలమార్గంలో 39 అడుగుల లోతులో ఐదువేల కేజీల బరువు కలిగిన రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబును గుర్తించారు. అయితే ఆ బాంబుని నిర్వీర్యం చేసేలోపే పేలిందని, కానీ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ బాంబు పేలుడుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ బాంబును టాల్‌బారు అని, లేదా భూకంప బాంబు అని కూడా పిలుస్తారు. 1945వ సంవత్సరంలో నాజీ యుద్ధనౌకపై చేసిన దాడిలో ఈ బాంబును రాయల్‌ వైమానిక దళం తొలగించింది. గత సంవత్సరం వాయువ్య పోలాండ్‌లోని ఓడరేవు నగరమైన స్వినౌజ్సీకి దగ్గరగా పూడిక తీసేటప్పుడు దాని ముక్కు బయటకు వచ్చింది. ఇది ఆరు కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు, 2.4 టన్నుల పేలుడు పదార్థాలతో నిండి ఉంది. అంటే 3.6 టన్నుల టిఎన్‌టికి సమానం. ఈ బాంబు నిర్వీర్యం చేసే సమయంలో 500 మీటర్ల దూరంలో ఉన్న వంతెనకు ముప్పు వాటిల్లవచ్చని నేవీ తిరస్కరించింది. కానీ రిమోట్‌ సహాయంతో దాన్ని నిర్వీర్యం చేయాలని చూశారు. కాని సాధ్యం కాలేదని నేవీ ప్రతినిధి గ్రెజోర్జ్‌ లెవాండోస్కీ తెలిపారు. బాంబు చుట్టూ 2.5 కిలోమీటర్ల ప్రాంతంలో 750 మంది స్థానికులను ఖాళీ చేయించారు. కాగా, స్థానికుల్లో ఓ మహిళ తాము ఇక్కడే యాభై సంవత్సరాలుగా నివశిస్తున్నామని, అధికారులు ఆదేశించడంతో మొదటిసారిగా ఈ ప్రాంతాన్ని వదిలి బయటకు వెళాల్సి వచ్చిందని అన్నారు.