Jan 18,2022 20:18

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ
మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ రెండోరౌండ్‌లోకి రష్యాకు చెందిన 2వ సీడ్‌ అలెగ్జాండర్‌ మెద్వదెవ్‌, గ్రీక్‌కు చెందిన 4వ సీడ్‌ స్టెఫొనాస్‌ సిట్సిపాస్‌ ప్రవేశించారు. మంగళవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో మెద్వదెవ్‌ 6-1, 6-4, 7-6(7-3)తో లాక్సోనెన్‌(కెనడా)ను, సిట్సిపాస్‌ 6-2, 6-4, 6-3తేడాతో యేమర్‌(స్వీడన్‌)ను వరుససెట్లలో ఓడించారు. ఐదుసెట్ల హోరాహోరీ పోటీలో బ్రిటన్‌కు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ ఆండీ ముర్రే 6-1, 3-6, 6-4, 6-7(5-7), 6-4తో 21వ సీడ్‌ బసిలీషిల్లీ(జార్జియా)పై పోరాడి నెగ్గాడు. మరో పోటీలో ఆస్ట్రేలియాకు చెందిన కిర్గియోస్‌ 6-4, 6-4, 6-3తో బ్రాడీ(బ్రిటన్‌)పై, 32వ సీడ్‌ మానర్‌ 3-6, 6-3, 6-0, 6-3తో మసెట్టిపై నెగ్గి రెండోరౌండ్‌లోకి ప్రవేశించారు.
కెర్బర్‌ ఔట్‌..
మహిళల సింగిల్స్‌లో 16వ సీడ్‌, జర్మనీకి చెందిన ఆండీ కెర్బర్‌కు తొలిరౌండ్‌లోనే షాక్‌ తగిలింది. మంగళవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో కెర్బర్‌ 4-6, 3-6తేడాతో అన్‌సీడెడ్‌ కనెపి(ఈస్టోనియా) చేతిలో ఓడింది. మరో పోటీలో 27వ సీడ్‌ కొలిన్స్‌(అమెరికా) 6-1, 6-3తో సహచర క్రీడాకారిణి డోలెహిడే ఓడించగా.. 2021 ఫ్రెంచ్‌ఓపెన్‌ సెమీఫైనలిస్ట్‌, 29వ సీడ్‌ జిదాన్సేక్‌(స్లొవేనియా) 3-6, 6-3, 7-6(10-8)తో రస్‌(నెదర్లాండ్స్‌)పై చెమటోడ్చి నెగ్గింది. 14వ సీడ్‌ హలెప్‌(రొమేనియా), రష్యాకు చెందిన 25వ సీడ్‌ కసట్కినా, 10వ సీడ్‌ పవియుచెన్‌కోవా ప్రత్యర్థులపై గెలిచి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లారు.