Jan 26,2022 00:01

- విభజనపై కసరత్తు కొలిక్కి - త్వరలోనే అధికారిక ప్రకటన
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి:
 రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలోని అధికారులు కూడా ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు. కర్నూలు జిల్లాను రెండు జిల్లాలుగా విభజించనున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది..
             రాష్ట్రంలో జిల్లాల విభజన ప్రక్రియను ప్రభుత్వం ఓ కొలిక్కి తీసుకువచ్చింది. జిల్లాల విభజనపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. కర్నూలు జిల్లాను రెండుగా విభజించనున్నట్లు సమాచారం. కర్నూలు, నంద్యాల జిల్లా కేంద్రాలతో ఈ కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఆయా జిల్లాల పరిధిలోకి రానున్నాయి. జిల్లాల విభజన ప్రక్రియపై వివిధ అంశాలపై పలు శాఖల అధికారులతో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. విభజన ఎలా ఉండాలి? సరిహద్దుల నిర్ధారణకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలేవి? దీనివల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఏ విధానం పాటించాలి? వంటి అనేక అంశాలపై చర్చించి మార్గదర్శకాలు రూపొందించారు. మ్యాన్‌ పవర్‌ కమిటీ కొత్త జిల్లాలకు అవసరమైన జిల్లా స్థాయి అధికారులు, ఇతర ఉద్యోగుల వివరాలను సేకరించింది. సరిహద్దులను గుర్తించడం, జిల్లాల మ్యాపులను తయారు చేయడం, మండలాల, గ్రామాల మ్యాపులను తయారు చేయడం వంటి పనులను ల్యాండ్‌ కమిటీ చేసింది. కొత్త జిల్లాకు కావాల్సిన కార్యాలయ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కమిటీ గుర్తించింది. వీటిపై అధ్యయనం తర్వాత జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంచేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రెవెన్యూ శాఖ ముందుగా ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీచేస్తుంది. దీనిపై సూచనలు, సలహాల కోసం 30 రోజుల గడువు ఇస్తారు. వచ్చిన సూచనలన్నింటినీ పరిశీలించి అవసరమైతే కొన్ని మార్పులు, చేర్పులు చేస్తారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్‌ ఇస్తారు. తుది నోటిఫికేషన్‌లోనే కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలుపుతూ అపాయింటెడ్‌ తేదీని పేర్కొంటారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా స్థాయి అధికారులను నియమిస్తారు. ఈ ప్రక్రియనంతటినీ ఉగాదిలోపు పూర్తిచేసి కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సమాయమత్తమవుతోంది.