May 04,2021 13:13

న్యూఢిల్లీ : గత ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌.. భారత్‌లో మరో రికార్డును సృష్టించింది. గడచిన 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకుని.. భారత్‌లో ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగానే.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికాలో (3.24 కోట్లు) కేసులు నమోదవ్వగా.. రెండు కోట్ల మార్క్‌ను దాటిన దేశం భారత్‌ కావడం గమనార్హం. కాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా.. 3,57,229 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. ఇక సోమవారం ఒక్కరోజే.. 3,449 మంది మరణించారు. ఇక ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 34 లక్షలకు చేరింది.
ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికంగానే నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం కర్ణాటకలో ఏకంగా 44 వేల కేసులు నమోదయ్యాయి. ఇక సుమారు నెల రోజుల తర్వాత మహారాష్ట్రలో కరోనా కేసులు 50 వేలకు (48,621) తక్కువగా నమోదు కావడం విశేషం.