Apr 08,2021 23:32

ప్రజాశక్తి-పుల్లలచెరువు: ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమైన సంఘటన పుల్లలచెరువు మండలంలోని చిన్న పిఆర్‌సి తాండాలో గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదాల్లో తాండాకు చెందిన దేవసోతు చిన్న మంత్రూ నాయక్‌, అతని కుమారుడు నాగ నాయక్‌ల పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఇంట్లో ఉన్న గ్యాస్‌ లీక్‌ అయిన కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రమాదంలో గృహోపకరణాలు, నిల్వ ఉంచిన ధాన్యం, నగదుతో పాటు ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. యర్రగొండపాలెం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు రూ.5 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లింది. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.