Oct 13,2021 20:40

మరో రూ.100 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్‌ : ప్రముఖ పరుపుల విక్రయ సంస్థ డ్యూరోఫ్లెక్స్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంపునపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మేడ్చల్‌ వద్ద ఉన్న ప్లాంట్‌ సామర్థ్యాన్ని రెండింతలు చేస్తున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్‌, బిజినెస్‌ హెడ్‌ మోహన్‌ రాజ్‌ జగనీవాస్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ యూనిట్‌లో రోజుకు 300 పరుపులు ఉత్పత్తి చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాదిన్నరలోగా ఈ సామర్థ్యాన్ని 600కి చేర్చనున్నామన్నారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 150 మంది పని చేస్తున్నారని.. ఈ సంఖ్యను 300కి పెంచనున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తి సామర్థ్యం, విస్తరణకు మరో రూ.80 నుంచి రూ.100 కోట్ల వరకు పెట్టుబడులకు ప్రణాళికలు వేశామన్నారు. హైదరాబాద్‌లో మరో ఎక్స్‌క్లూజివ్‌ సెంటర్‌ను గచ్చిబౌలిలో ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి నగరంలో మరో మూడు ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లను అందుబాటులోకి తేనున్నామన్నారు.