Mar 19,2023 22:27

నూనె అంకమ్మరావును సత్కరిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : కవితా సంపుటి రైతు దయనీయ స్థితికి దర్పణం వంటిదని, అక్షర సేద్యం చేస్తున్న కవి విత్తనాలతో సేద్యం చేసే రైతుల గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ రాయడం గొప్పగా ఉందని ఎన్‌టిఆర్‌ కళాపరిషత్‌ అధ్యక్షుడు ఈదర హరిబాబు తెలిపారు. ఒంగోలులోని అంబేద్కర్‌ భవన్‌లో నాగభైరవ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో మట్టబండి పుస్తక పరిచయ సభ ఆదివారం నిర్వహించారు. ఈసభ నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ అధ్యక్షత వహించారు. కళామిత్రమండలి సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ నూనె అంకమ్మరావు సభా సంచాలకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ రైతులు పడుతున్న యథార్థ దశ్యాలకు నిలువుటద్దం ఈపుస్తకం అని వ్యాఖ్యానించారు. మరో ముఖ్య అతిథి నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంతో గొప్పగా రైతు హదయాన్ని ఆవిష్కరించారని ,రైతు పరంగా వచ్చిన పుస్తకాలలో ఈ మట్టిబండి దీర్ఘకవిత ముందు వరుసలో ఉంటుందని శ్లాఘించారు. కళారత్న డాక్టర్‌ భూసురపల్లి వెంకటేశ్వర్లు మట్టిబండిని గూర్చి విశ్లేషిస్తూ భూమి పుత్రుల కష్టాల కడగండ్లను,వారి దుర్భర జీవితాలను సమగ్రంగా మనకళ్ళ ముందు ఉంచేందుకు రచయిత తమవంతు ప్రయత్నం చాలా గొప్పగా చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 21 మంది కవులు కవిసమ్మేళనంలో పాల్గొని తమ కవితా పఠనాన్ని కొనసాగించారు. అనంతరం అతిథులను, కవులను నిర్వాహకులు సత్కరించారు.ఈ కార్యక్రమంలో వీరవల్లి సుబ్బారావు , జక్కంపూడి సీతారామారావు, డాక్టర్‌ శింగారావు, కుర్రా ప్రసాద్‌ బాబు, మిడసల మల్లికార్జునరావు,డాక్టర్‌ కోటేశ్వరరావు పాల్గొన్నారు.