
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీపై బిజెపి ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి శుక్రవారం ఉదయం సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం రాహుల్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు తెలిపింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల్లోనే లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్‌పై వెంటనే చర్యలకు దిగడం విశేషం. ''కేరళలోని వాయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని సూరత్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దోషిగా తేల్చడంతో లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. దోషిగా తేలిన 2023 మార్చి 23 నుంచి నుంచి అనర్హత వర్తిస్తుంది. రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(ఈ) ప్రకారం నిర్ణయం తీసుకున్నాం'' అని పేర్కొంటూ లోక్‌సభ సెక్రటరీయేట్ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సర్క్యూలర్ జారీ చేశారు. కాగా, ఆర్టికల్ 103 ప్రకారం ఇలాంటి వివాదాల్లో అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ప్రకారం రెండేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం శిక్షపడిన ప్రజా ప్రతినిధికి శిక్షాకాలంతో పాటు మరో ఆరేళ్లు పోటీ చేయడానికి వీలులేదు.ప్రజా ప్రతినిధులకు శిక్ష పడిన వెంటనే అప్పీలకు వెళ్లకుండా అమలులోకి వస్తుందని 2013లో అప్పీలకు వెళ్లకుండా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిని నిలుపుదల చేసి, అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం ఇస్తూ నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ కాపీలను అప్పటి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చించివేశారు. దాంతో ఆర్డినెన్స్ నిలిచిపోయాయి. నాడు ఆర్డినెన్స్ చట్టంగా మారి ఉంటే, ప్రస్తుతం రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడకుండా అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఆర్డినెన్స్ ఆమోదించకపోవడంతో రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు అవకాశం లభించింది.
- చట్ట ప్రకారం ముందుకు : ఖర్గే
రాహుల్‌పై సూరత్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మ్లలికార్జున ఖర్గే చెప్పారు. బిజెపి ఇలా చేస్తుందని తాము ముందే ఊహించామన్నారు. రాహుల్ నోరు నొక్కడానికే ఇలా చేశారని విమర్శించారు. తన సోదరుడు భయపడే రకం కాదని, భయపడబోడని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ అన్నారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్, రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ కూడా బిజెపి రాహుల్ గొంతు నొక్కే యత్నం చేస్తోందని విమర్శించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తదితరులు ఖండించారు.
- నిరంకుశ దాడులను ఖండించాలి :సీతారాం ఏచూరి
రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా ఖండించారు. ''ఇప్పుడు రాహుల్ గాంధీ మాదిరిగానే ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని వారిపై అనర్హత వేటు వేయడానికి బిజెపి నేరపూరిత పరువు నష్టం మార్గాన్ని ఉపయోగిస్తుండడం ఖండించదగినది. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా సిబిఐ, ఇడి దుర్వినియోగంపైన ఇది వస్తుంది. ఇటువంటి నిరంకుశ దాడులను ప్రతిఘటించి ఓడించాలి'' అని ట్వీట్ చేశారు.
- అందరం కలిసి నిలబడాలి : శరద్ పవర్
రాహుల్‌పై అనర్హత వేటు రాజ్యాంగ విరుద్ధమని ఎన్‌సిపి నాయకులు శరద్‌పవర్ ఆరోపించారు. ''లోక్‌సభ ఎంపిలుగా రాహుల్ గాంధీ, ఫైజల్‌లపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగం ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధం. ఇక్కడ ప్రజాస్వామ్య విలువలు తగ్గుతున్నాయి. ఇది ఖండించదగినది. రాజ్యాంగం సూత్రాలకే విరుద్ధం. ప్రజాస్వామిక సంస్థలను కాపాడుకోవడానికి అందరం కలిసి నిలబడాలి'' అని తెలిపారు.