Oct 13,2021 13:17

న్యూఢిల్లీ  :   లఖింపూర్‌ ఘటనలో న్యాయమైన విచారణ జరగాలంటే కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను   తొలగించాల్సిందేనని  కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం రాష్ట్రపతిని కోరింది. ఈ అంశంపై ప్రభుత్వంతో మాట్లాడతానని రాష్ట్రపతి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో ప్రతినిధుల బృందం బుధవారం రాష్ట్రపతితో సమావేశమైంది. ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలతో లఖింపూర్‌ ఘటనపై విచారణ జరిపించాలని, రైతుల హత్యకు కారణమైన నిందితునికి శిక్ష విధించబడాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. లఖింపూర్‌ రైతు హత్యల కేసులో ప్రధాన నిందితుడైన ఆశిష్‌మిశ్రాను ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అజరు మిశ్రా ఆ పదవిలో కొనసాగినంత కాలం రైతుల కుటుంబానికి న్యాయం జరగదని అన్నారు. యుపి ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. రాహుల్‌గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, ఎకె ఆంటోనీ, మల్లిఖార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్‌, గులామ్‌ నబీ ఆజాద్‌, అధిర్‌ రంజన్‌ చౌదరిలు ఈ ప్రతినిధుల బృందంలో ఉన్నారు.