Sep 22,2022 15:51

న్యూఢిల్లీ  :   కాంగ్రెస్‌ అధ్యక్ష పదవీ కేవలం సంస్థాగతమైన పదవి మాత్రమే కాదని.. అది దేశానికి ప్రాతినిధ్యం వహించడమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.   కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఒక భావజాలాన్ని, విశ్వాసాన్ని, దేశ దృక్కోణాన్ని ఆవిష్కరిస్తుందని అన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వారు వీటిని దృష్టిలో  పెట్టుకోవాలని సూచించారు. అలాగే ఉదయ్  పూర్‌ ‘చింతన్‌ శిబిర్‌లో 'ఒక వ్యక్తికి ఒకే పదవి' అనే సిద్ధాంతానికి మద్దతు ఇచ్చామని... ఇది కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు రాహుల్‌ గాంధీ కేరళలో చెప్పారు. దీంతో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగాను కొనసాగుతానంటూ ఇటీవల గెహ్లాట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను అధ్యక్ష పీఠాన్ని చేపడితే.. తన ప్రత్యర్థి సచిన్‌ పైలెట్‌ సిఎం అవుతారని ఆయన భావిస్తున్నారు. రాహుల్‌ వ్యాఖ్యలతో.. అశోక్‌ గెహ్లాట్‌ అధ్యక్షుడైతే.. సిఎం పదవిని వదులకోక తప్పదని స్పష్టమైంది.

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో పలువురు నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే శశిథరూర్‌ ప్రకటించారు. తాజాగా సీనియర్‌ నేత దిగ్విజయ్  సింగ్‌ పేరు తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, కేంద్రమంత్రులు మనీష్‌ తివారి, పృధ్వీరాజ్‌ చవాన్‌, ముకుల్‌ వాస్నిక్‌, మల్లికార్జున్‌ ఖర్గే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు పేర్లు వినిపిస్తున్నాయి.