
న్యూఢిల్లీ : ' నో అబ్జెక్షన్ పత్రం (ఎన్‌ఒసి)' ని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన దరఖాస్తుపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వైభవ్ మెహతా ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత మధ్యాహ్నం తగిన ఉత్తర్వులను జారీ చేస్తానని చెప్పారు. రాహుల్ గాంధీ అభ్యర్థనను తిరస్కరిస్తూ బిజెపి మాజీ ఎంపి సుబ్రమణియన్ స్వామి ఢిల్లీ కోర్టులో సమాధానం దాఖలు చేశారు. పదేళ్లకు పాస్‌పోర్ట్‌ను జారీ చేయడానికి, చెల్లుబాటు అయ్యే, ప్రభావవంతమైన కారణం లేదని దానిలో పేర్కొన్నారు. రాహుల్ తరపున హాజరైన న్యాయవాది తరన్నమ్ చీమా మాట్లాడుతూ.. రాహుల్‌కిచ్చిన బెయిల్ ఉత్తర్వుల్లో ఎలాంటి షరతులు లేవని అన్నారు. 2జి, బగ్గు కుంభకోణం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి కూడా పదేళ్ల పాటు పాస్‌పోర్ట్‌లు మంజూరు చేయబడ్డాయని అన్నారు. సాధారణంగానే పదేళ్లకు పాస్‌పోర్ట్‌ను జారీ చేయవచ్చని కోర్టుకు తెలిపారు. అలాగే రాహుల్‌పై ఎలాంటి క్రిమినల్ కేసుల లేవని స్పష్టం చేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉన్న రాహుల్ గాంధీకి తాజా పాస్‌పోర్ట్ కోసం ఎన్‌ఒసిని జారీ చేయడంపై లిఖితపూర్వక సమాధానాన్ని దాఖలు చేయాలని ఈ నెల 24న రూస్ అవెన్యూ కోర్టు సుబ్రమణియన్ స్వామిని కోరింది. ఎంపిగా అనర్హత వేటు పడిన అనంతరం రాహుల్ తన దౌత్య పాస్‌పోర్ట్‌ను సమర్పించి... సాధారణ పాస్‌పోర్ట్ పొందేందుకు ఎన్‌ఒసి పత్రాన్ని కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.