
న్యూఢిల్లీ : భారత ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం స్పష్టతనిచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాను భారత ప్రజాస్వామ్యం గురించి మాత్రమే ప్రశ్నలు లేవనెత్తానని, అందుకు జాతీయ వ్యతిరేకి అని ముద్ర వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీకి ఆయన వివరణనిచ్చారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాలని తాను ఏ దేశాన్ని ఆహ్వానించలేదని రాహుల్ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇది భారత అంతర్గత విషయమని.. దీన్ని అధికారంలో ఉన్న పార్టీయే పరిష్కరించాల్సిన అవసరం ఉందని తాను స్పష్టంగా చెప్పానని రాహుల్ సమావేశంలో వివరించినట్లు తెలుస్తోంది.
తొలుత జి20 అధ్యక్షతపై జయశంకర్ తన ప్రణాళికలను కమిటీకి వివరించారు. అది పూర్తయిన తర్వాత ఎంపి మాట్లాడుతూ.. కొంత మంది మన దేశ ప్రజాస్వామ్యాన్ని విదేశీ గడ్డపై అవమానిస్తున్నారని అన్నట్లు తెలుస్తోంది. దీనికి స్పందిస్తూ రాహుల్ సుదీర్ఘంగా తన వాదనను కమిటీ ముందు ఉంచినట్లు సమాచారం. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష ఎంపిల మధ్య సమావేశంలో వాగ్వివాదం జరిగినట్లు సమాచారం. తీవ్ర వాగ్వివాదం అనంతరం జైశంకర్ రాహుల్ వివరణను ఆపి, పార్లమెంటులో ఈ వివరాలపై మాట్లాడాలని నేతలకు సూచించినట్లు సమాచారం. కొంతమంది బిజెపి ఎంపిలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, అధికార పార్టీ ఎంపిలే ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు.. దానిపై క్లారిటీ ఇచ్చే హక్కు ప్యానెల్ సభ్యుడికి ఉంటుందంటూ ప్రతిపక్ష ఎంపిలు రాహుల్‌కు మద్దతు పలికినట్లు సమాచారం.
లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంటులో పెద్ద దుమారం చెలరేగింది. పార్లమెంటులో రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ బిజెపి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఉభయ సభల్లోనూ కార్యకలాపాలకు అడ్డుపడుతోంది.