Jul 03,2022 20:57

ముంబయి : మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బిజెపి ఎమ్మెల్యే రాహుల్‌ నర్వేకర్‌ ఆదివారం ఎన్నికయ్యారు. నర్వేకర్‌కు 164 ఓట్లు రాగా, ప్రతిపక్ష అభ్యర్థి రాజన్‌ సల్వికి 107 ఓట్లు లభించాయి. రెండు రోజుల పాటు జరిగే లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 45 ఏళ్ల నర్వేకర్‌ స్పీకర్‌ పదవిని అధిష్టించిన అతి పిన్న వయస్కుడిగా ఘనత సాధించారని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు. అలాగే రాష్ట్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న రాంరాజే నాయక్‌కు నర్వేకర్‌ స్వయానా అల్లుడు కావడం విశేషం. ముంబయిలోని కొలాబా నియోజకవర్గం నుంచి నర్వేకర్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో స్పీకర్‌ పదవికి నానా పటోల్‌ (కాంగ్రెస్‌) రాజీనామా చేయడంతో అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. స్పీకర్‌ పదవికీ ఎన్నిక నిర్వహించాలని ఎంవిఎ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని గవర్నర్‌ పట్టించుకోలేదు. శివసేన నుంచి తిరుగుబాటు చేసి ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని రోజుల్లోనే స్పీకర్‌ పదవికి ఎన్నిక నిర్వహించడం విశేషం.