Feb 28,2021 21:47

అమరావతి: కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే అనేక సాంకేతిక విద్యాసంస్థలు (సెంట్రల్లీ ఫండెడ్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ -సిఎఫ్‌టిఐ) రిజర్వేషన్ల నిబంధనలను పాటించలేదు. అనేక సంస్థల్లో ఏళ్ల తరబడి రిజర్వేషన్లను ఉల్లంఘస్తున్నారు. ఫలితంగా ఎస్సీ.ఎస్‌టి, బిసి విద్యార్థులు పెద్దఎత్తున రిజర్వేషన్లను కోల్పోతున్నారు. సిపిఎం ఎంపీలు ఎలమరం కరీం,వికాస్‌ రంజన్‌ భట్టాచార్యలు అడిగిన ప్రశ్నలకు రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖమంత్రి ఇచ్చిన జవాబును పరిశీలిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుంది.
                                       ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో..
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సి) లో 2016ా18 నుండి ఒబిసి విద్యార్థులకు నామమాత్రంగానే సీట్లు లభిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ పిహెచ్‌డిలో ఎస్‌సి,ఓబిసిలకు సంబందించిన విద్యార్థులు గత రెండు సంవత్సరాల్లో ఒక్కరు కూడా లేరు.
                                        నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో..
కాలికట్‌, పాట్నా, నాగపూర్‌, కురుక్షేత్ర ఎన్‌ఐటిలలో గత మూడు సంవత్సరాలుగా ఎస్‌టి విద్యార్థులు ఒక్కరికి కూడా సీటు లభించలేదు. ఎస్‌సిలకు సంబంధించి కూడా కొన్ని ఎన్‌ఐటిలలో ఇదే పరిస్థితి నెలకొంది.
. కాలికట్‌ నిట్‌లో అడ్మిట్‌ అయిన మొత్తం విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే గత మూడు సంవత్సరాల్లో ఎస్‌సిలు కేవలం 5.1శాతం మంది మాత్రమే అడ్మిట్‌ అయ్యారు. జైపూర్‌లో ఇది 5.2శాతంగా ఉంది.
. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో నాగపూర్‌ నిట్‌లో ఒక్క ఎస్‌సి. ఎస్‌టి, ఓబిసి విద్యార్థి కూడా అడ్మిట్‌ కాలేదు.
. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు కలిపి 50 శాతం సీట్లు ఉండాలి. జనరల్‌ సీట్లు 50 శాతమే ఉండాలి. కానీ సురత్‌కల్‌, శ్రీనగర్‌, కురుక్షేత్ర, ఉత్తరాఖండ్‌ ఎన్‌ఐటిలలో 70శాతం జనరల్‌ అడ్మిషన్లే ఉన్నాయి.
ట్రిపుల్‌ఐటిలలో గ్వాలియర్‌, కాంచీపురం, కర్నూలు ఐఐఐటిలలో గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఒక్క ఎస్‌టి అభ్యర్థికి కూడా సీటు రాలేదు.
కేంధ్ర నిధులతో నడిచే ఐదు ట్రిపుల్‌ ఐటిలలో ఎస్‌సిలకు 11శాతం, ఎస్‌టిలకు 1.9శాతం మాత్రమే అడ్మిషన్లు లభించాయి. ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే మిగిలిన 12 ఐఐఐటిలో ఈ మాత్రం సీట్లు కూడా ఎస్‌సి, ఎస్‌టిలకు లభించలేదు.
                                               ఐఐఎస్‌ఇఆర్‌లలో
. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చి (ఐఐఎస్‌ఇఆర్‌)లలో కూడా రిజర్వేషన్ల నిబంధనలు అమలు కావడం లేదు. తిరువనంతపురం ఐఐఎస్‌ఇఆర్‌ ఎస్‌టి రిజర్వేషన్‌ అమలులో వెనుకబడి ఉంది.
దీర్ఘకాలంగా ఈ ప్రముఖ విద్యా సంస్థలలో రిజర్వేషన్ల అమలు కానందువలన దళిత, గిరిజన, ఒబిసి తరగతుల నుండి తగిన సంఖ్యలో అర్హతలు కల బోధనా సిబ్బంది కూడా లేకుండా పోయారు.
          దళిత, బలహీన వర్గాల అభ్యున్నతి సాధించడానికి ఆ సామాజిక తరగతుల నుండి శాస్త్ర, సాంకేతిక రంగ నిపుణులు కూడా తయారు కావాల్సిన అవసరం చాలా ఉందని డాక్టర్‌ అంబేద్కర్‌ పలు సందర్భాలలో చెప్పారు.
మోడీ ప్రభుత్వం ఐఐటి, ఎన్‌ఐటిలలో రిజర్వేషన్ల అమలును మెరుగుపరచడం ఎలా అన్న విషయాన్ని పరిశీలించడానికి ఒక నిపుణుల కమిటీని నియమించింది.
ఆ కమిటీ ఐఐటి, ఎన్‌ఐటిలలో బోధనా సిబ్బంది నియామకాలలో రిజర్వేషన్ల అమలును పాటించనవసరం లేకుండా మినహాయింపు ఇవ్వాలని సిఫార్సు చేసింది!
ఇది మోడీ మార్కు సామాజిక న్యాయం!