Mar 24,2023 23:58

మాట్లాడుతున్న కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ

ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, కోనాం గ్రామం శివారు కొత్తవీధి సర్వే నెంబర్‌ 289లో కొన్ని దశాబ్దాలుగా 16 గిరిజన కుటుంబాలు సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించిన రికార్డులను గత ఏడాది జూన్‌ 13న నిబంధనలకు విరుద్ధంగా అప్పటి తహశీల్దారు తారుమారు చేసి గిరిజనులకు అన్యాయం చేశారని అఖిలభారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పిఎస్‌ అజరు కుమార్‌ ఆరోపించారు. ఈ వాస్తవాలు తెలుసుకునేందుకు కలెక్టర్‌ పర్యటించాలని కోరుతూ శుక్రవారం స్థానిక నెహ్రూ చౌక్‌ జంక్షన్‌లో బాధిత గిరిజనులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు జరిగిన అన్యాయంపై విజయవాడ భూమిశిస్తూ కమిషనర్‌కు విన్నవించగా, మొత్తం భూమిని ఎంజాయ్మెంట్‌ సర్వే చేయాలని, అనకాపల్లి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ను స్వయంగా వెళ్లి విచారణ చేసి నివేదిక అందించాలని ఆయన ఆదేశించారని తెలిపారు. కాని నేటి వరకు జెసి తనిఖీ చేయలేదన్నారు. ఇద్దరు ఆర్డీవోలు సదరు భూములను పరిశీలించి సాగులో గిరిజనులు ఉన్నట్టు కళ్ళతో చూశారని, అయితే నోటితో చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. మానవ హక్కుల వేదిక ప్రతినిధి విఎస్‌ కృష్ణ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ తమ బందం గత ఏడాది ఆగస్టు 30న గ్రామాన్ని పరిశీలించి వాస్తవాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లామని, అయితే కలెక్టర్‌ తమ దిగువ సిబ్బంది ఇచ్చిన నివేదికపై ఆధారపడినట్టు స్పష్టమవుతుందని పేర్కొన్నారు. అధికార పార్టీ మంత్రులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రికార్డులు తారుమారు చేసినట్లు తెలిపారు. సిపిఐ నాయకులు ఆర్‌ అప్పలరాజు, కాంగ్రెస్‌ నాయకులు ఐఆర్‌ గంగాధర్‌ మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు నియోజకవర్గంలో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆదివాసీలు చేసే న్యాయ పోరాటానికి తాము ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామని చెప్పారు.
గిరిజనులకు ఎటువంటి హక్కులూ లేవు : జెసి
అనకాపల్లి : చీడికాడ మండలం కోనాం గ్రామం శివారు కొత్తపేట గ్రామం సర్వేనెంబర్‌ 289/1లో 29 ఎకరాల 86 సెంట్లు భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందిన జిరాయితీ భూమని, ఈ భూముల్లో సాగు చేస్తున్న గిరిజనులకు ఎటువంటి హక్కులు, ఆధారాలు లేవని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి వెల్లడించారు. శుక్రవారం తన ఛాంబర్లో జెసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ భూమిని తాము దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నామని, తమ పేర రెవెన్యూ రికార్డుల్లో, వెబ్‌ లాండ్‌లో నమోదు చేసి పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని కొంతమంది గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తు చేసిన వారు కూడా స్థానికులు కాదని గ్రామంలో జరిగిన బహిరంగ విచారణలో తేలిందన్నారు. ఈ భూమిని పంట ఫల సాయం భాగస్వామ్యం నిమిత్తం కొందరు గిరిజనులకు సదరు భూమి యజమాని ఇవ్వడం జరిగిందని, అయితే ఆ భూములను ఆరుగురు వ్యక్తులు కొనుగోలు చేసినట్టు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు కూడా మంజూరైనట్టు తమ విచారణలో తేలిందని, వీరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని తెలిపారు.