Jun 25,2022 19:47

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయని, ఉత్తర కోస్తాలోని విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం శనివారం రాత్రి వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల మోస్తరుగా వానలు కురిసినట్టు అధికారులు తెలిపారు. విశాఖ, కళింగపట్నం ప్రాంతాల్లో రెండు మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని చోట్లా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉన్నట్టు తెలిపారు.